పాత పద్ధతిలోనే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయండి 

పాత పద్ధతిలోనే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయండి 
  • మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండగా విడిగా ఎందుకు?
  • పాత పద్ధతిలోనే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయండి 
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌ 1 పోస్టుల్లో మహిళలకు విడిగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా, మళ్లీ విడిగా రిజర్వేషన్ల వర్తింపు ఎందుకని ప్రశ్నించింది. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. గ్రూప్‌‌ 1 పోస్టులను పాత రిజర్వేషన్ల విధానంలోనే భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌‌ పి.మాధవి దేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్‌‌ 1 పోస్టుల్లో మహిళలకు విడిగా రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్‌‌ చేస్తూ కోడెపాక రోహిత్‌‌, మరికొందరు హైకోర్టులో రిట్‌‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టగా.. జనరల్ కోటాతో పాటు కమ్యూనిటీల కేటగిరీలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఉండగా, మళ్లీ విడిగా వారికి రిజర్వేషన్ల కేటాయింపు చెల్లదని పిటిషనర్ తరఫు లాయర్ సుంకర చంద్రయ్య వాదించారు. ఇది రాజేశ్ కుమార్‌‌ దానియా వర్సెస్‌‌ రాజస్థాన్‌‌ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని చెప్పారు. అయితే మహిళల పురోగతి కోసమే ఆ విధమైన రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. మహిళలకు విడిగా రిజర్వేషన్ల వర్తింపు చెల్లదని, పాత పద్ధతిలోనే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది.

ఏజెన్సీల్లో దళితబంధు ఎట్లిస్తరో చెప్పండి

ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలకు దళితుబంధు స్కీంను ఏవిధంగా అమలు చేస్తోరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. ఏజెన్సీ ఏరియాల్లో నాన్‌‌‌‌ ట్రైబల్స్‌‌‌‌కు దళితబంధు స్కీం అమలు చేయడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ ఆదివాసీ వెల్‌‌‌‌ఫేర్‌‌‌‌ పరిషత్‌‌‌‌ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్‌‌‌‌ వాదిస్తూ..  ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలు వ్యాపారాలు చేసుకోడానికి షెడ్యూల్డ్‌‌‌‌ ఏరియా భూముల బదలాయింపులు చట్ట వ్యతిరేకమని గుర్తుచేశారు. గిరిజనేతరులు స్థిరాస్తులపై హక్కులు పొందేందుకు వెసులుబాటు లేదన్నారు. ప్రభుత్వ వివరణ కోసం విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది.

న్యూట్రిషన్‌‌‌‌ కిట్ల టెండర్లు  ఖరారు చేయొద్దు

పేద గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కేసీఆర్‌‌‌‌ న్యూట్రిషన్ కిట్ల స్కీం టెండర్లను ఈ నెల 28 వరకు ఖరారు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఆదేశించే వరకు టెండర్లను ఫైనల్ చేయవద్దని, అయితే టెండర్ల ప్రక్రియను మాత్రం కొనసాగించువచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియను సవాల్‌‌‌‌ చేస్తూ హైదరాబాద్‌‌‌‌కు చెందిన ‘లాన్ ఈ– గవర్నెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌’ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టెండర్లను ఖరారు చేయవద్దని ఆదేశించింది.