కేసీఆర్ త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలి: చిరంజీవి

కేసీఆర్ త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలి: చిరంజీవి

హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సీనీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని చెప్పారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానని చిరంజీవి వెల్లడించారు. సినిమాలు ఎలా అడుతున్నాయి.. ఇండస్ట్రీ ఎలా ఉందని కేసీఆర్ ఈ సమయంలో కూడా అడగటం.. చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలిపారు.

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ను  పరామర్శించారు.   

ఇటీవలే కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు  వైద్యులు.  ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు  వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కేసీఆర్‌కు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.