'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్'..! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్ ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'పుష్ప-2: ది రూల్' ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వేటలో భాగంగా జపాన్‌లో అడుగుపెట్టింది. 'పుష్ప కున్రిన్' (Pushpa Kunrin) పేరుతో ఈ చిత్రం జనవరి 16, 2026న జపాన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.
టోక్యోలో ఘన స్వాగతం
లేటెస్ట్ గా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హతో కలిసి టోక్యో చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జపాన్ అభిమానులు నీరాజనాలు పలికారు. పూలగుత్తులు, సినిమా పోస్టర్లతో తమ ప్రియతమ నటుడికి స్వాగతం పలుకుతూ అక్కడి ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. జపాన్ లో అభిమానుల ఉత్సాహం చూస్తుంటే.. పుష్పరాజ్ క్రేజ్ సరిహద్దులు దాటిందని స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ సైతం టోక్యో స్కైలైన్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.
జపాన్ కనెక్ట్.. ఎర్రచందనం సెంటిమెంట్!
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జపాన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉండటం విశేషం. ముఖ్యంగా జపాన్ సంస్కృతిలో ఎర్రచందనంకు ఉన్న ప్రాధాన్యత, అక్కడి ప్రజలకు ఆ కలపతో ఉన్న అనుబంధం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారనుంది. స్మగ్లింగ్ నేపథ్యం ఉన్నప్పటికీ, పుష్పరాజ్ ఎదిగిన తీరు జపనీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సుకుమార్‌పై అల్లు అర్జున్ కృతజ్ఞత
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గీక్ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్‌లో విడుదల చేస్తోంది. ఇప్పటికే విడుదలైన జపనీస్ ట్రైలర్‌కు అక్కడ సినీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న సైతం "వైల్డ్ ఫైర్ గ్లోబల్ అవుతోంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తన గురువు, దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు (జనవరి 11) సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. "మీరు పుట్టడం వల్లే నా జీవితం మారింది" అంటూ సుకుమార్‌పై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. పుష్ప-3: ది రాంపేజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న తరుణంలో, జపాన్‌లో 'పుష్ప కున్రిన్' సృష్టించబోయే వసూళ్ల ప్రభంజనం ఎలా ఉండబోతుందో చూడాలి!
Icon star #alluarjun land in Japan welcome 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #Pushpa2TheRule #Pushpa2InJapan pic.twitter.com/lE4O004AGL
— Allu shan dhanush (@subramanyams755) January 13, 2026
