ఇండస్ట్రీ పంచాయితీకి శుభం కార్డు.. రేపటి (ఆగస్టు 22) నుంచి షూటింగ్స్ షురూ

ఇండస్ట్రీ పంచాయితీకి శుభం కార్డు.. రేపటి (ఆగస్టు 22) నుంచి షూటింగ్స్ షురూ

ఇండస్ట్రీ పంచాయితీకి శుభం కార్డు పడింది. వేతనాలు పెంచాలని గత 18 రోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చేస్తున్న స్ట్రైక్ కు ముగింపు దొరికింది. గురువారం (ఆగస్టు 21) హైదరాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ లో నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో వివాదం ముగిసింది. శుక్రవారం నుంచి షూటింగ్స్ ప్రారంభం అవుతాయని ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు ప్రకటించారు. 

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. చర్చలు సఫలం అయ్యేలా లేబర్ కమిషనర్ గంగాధర్ ప్రయత్నించారని అన్నారు. చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు. ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీలో మొదలైన వివాదానికి త్వరగా  పరిష్కారం తీసుకురమ్మని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలతో లేబర్ కమిషనర్ చర్చలు సఫలం అయ్యేలా చేశారని.. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సీఎం రేవంత్ కు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చేయాలని సీఎం ప్లాన్ దృష్టిలో ఉంచుకుని.. ఆదిశగా  ఇండస్ట్రీ ముందుకు వెళ్తుందని తెలిపారు. 

30 శాతం హైక్ అనేది జరుగుతుంది : గంగాధర్, లేబర్ కమిషనర్ 

కార్మికులు డిమాండ్ చేస్తున్నట్లు 30 శాతం వేతనాల పెంపు జరుగుతుందని లేబర్ కమిషనర్ గంగాధర్ అన్నారు. కార్మికులకు పలు డిమాండ్స్ ఉన్నాయని.. కానీ ప్రధానంగా మూడు, నాలుగు  కండిషన్స్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలిపారు. 22.5 శాతం  మొత్తంగా వేతనాల పెంపు  ఉంటుందని అన్నారు. 

ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ  వేస్తున్నామని.. మిగతా  చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. ఇక స్ట్రైక్ లేదని.. రేపటి నుంచి సూటింగ్స్ కంటిన్యూ అవుతాయని తెలిపారు. 

సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు: అనిల్ వల్లభనేని, ప్రెసిడెంట్, ఫెడరేషన్

ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇష్యూను సాల్వ్ చేసిందుకు ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని అన్నారు. కార్మిక శాఖ చొరవ తీసుకుని పని చేసిందని ఆయన తెలిపారు. ఎప్పుడూ మాలో మేమే చర్చలు చేసుకుని సమ్మె ముగిస్తాము.. కానీ ఈ సారి లేబర్ కమిషనర్ చొరవ తీసుకుందని అన్నారు. 

వేతనాల పెంపు 22.5 శాతం చేసిందని తెలిపారు. మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం  చొప్పున వేతనాల పెంపు ఉంటుందని తెలిపారు. తాము అడిగిన కొన్ని కండిషన్స్ అమలు చేస్తున్నారని.. మరికొన్నింటిపైన కమిటీ వేస్తున్నారని చెప్పారు.