సినీ కార్మికుల సమ్మె విరమణ

సినీ కార్మికుల సమ్మె విరమణ
  • మూడేండ్లలో 22% వేతనాల పెంపునకు నిర్మాతలు ఓకే
  • నేటి నుంచి సినిమా షూటింగ్‌‌లు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: సినీ కార్మికుల యూనియన్లు, నిర్మాతలతో  కార్మిక శాఖ గురువారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో 18 రోజులుగా జరుగుతున్న  సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది.  సమ్మె విరమిస్తున్నామని..శుక్రవారం నుంచి షూటింగ్ కు అటెండ్ అవుతామని యూనియన్ నేతలు ప్రకటించారు. కార్మికులకు వేతనాలు దశల వారీగా మూడేండ్లలో 22.5 శాతం పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెరగనున్నాయి. 

గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో  ఫిల్మ్ ఫెడరేషన్ తో పాటు కార్మిక సంఘాలు, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు యార్లగడ్డ సుప్రీయ, దామోదర ప్రసాద్ , డైరెక్టర్ తేజ లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ లు సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రస్తుతం కార్మికుల నుంచి మెంబర్ షిప్ ఫీజు, చందాలు ఎంత తీసుకుంటున్నారు అన్న అంశంపై చర్చించారు. చర్చలు ముగిసిన తరువాత ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి  ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.  హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చెయ్యాలనే సీఎం లక్ష్యం దిశగా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుందని వెల్లడించారు. కాగా, కార్మికులకు 22.5 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలను ఒప్పించినట్లు కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. మిగతా సమస్యలపై కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో ఈ కమిటీ రిపోర్ట్ అందచేస్తుందని వెల్లడించారు. సమ్మె ముగిసిందని, శుక్రవారం నుంచి షూటింగ్ లకు అటెండ్ అవుతున్నట్లు యూనియన్లు ప్రకటించాయన్నాయని గంగాధర్  పేర్కొన్నారు.