OperationSindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సినిమా పోస్టర్.. నెటిజన్ల ఆగ్రహంతో నిర్మాత క్షమాపణలు

OperationSindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సినిమా పోస్టర్.. నెటిజన్ల ఆగ్రహంతో నిర్మాత క్షమాపణలు

‘ఆపరేషన్‌ సిందూర్‌’..నిన్నటికి నిన్న వెలుగులోకి వచ్చిన ఈ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ ఉగ్రవాద క్యాంపులపై చేపట్టిన దాడికి పెట్టిన పేరిది. ఇప్పుడిదే పేరుతో సినిమా తీసేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలోనే నిక్కీ విక్కీ భగ్నాని ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్‌తో కలిసి, ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌’అనే కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ఉత్తమ్ మహేశ్వరి-నితిన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఓ మహిళా సైనికురాలు రైఫిల్‌ పట్టుకొని, తన నుదిటిన సిందూర్ పెట్టుకుంటూ.. యుద్ధ భూమిలో దిగడానికి సిద్ధం అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.

ఇది స్త్రీ గుర్తింపును.. దేశభక్తి విధితో మిళితం చేసే ప్రతీకాత్మక చర్యను చాటిచెప్పేలా ఉంది. అలాగే, ట్యాంకులు, ముళ్ల తీగలు మరియు ఫైటర్ జెట్‌లతో కూడిన మండుతున్న యుద్ధ భూమిని చూపిస్తోంది. ఓవరాల్గా ఈ పోస్టర్ 'ధైర్యం, త్యాగం మరియు దేశభక్తి' ఇతివృత్తాలను రేకెత్తిస్తుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. 

అయితే, ఇండో-పాక్ ఉద్రిక్తతల మధ్య ఇలా సినిమాను ప్రకటించడం ఏంటంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా..  ఇది నిజంగా 'సిగ్గుచేటు' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే, నిర్మాణ సంస్థలు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా క్షమాపణలు చెప్పాయి. “మన భారత సాయుధ దళాల ఇటీవలి వీరోచిత ప్రయత్నాల నుండి ప్రేరణ పొందిన ఆపరేషన్ సిందూర్ ఆధారంగా ఇటీవల ఒక చిత్రాన్ని ప్రకటించినందుకు నా హృదయపూర్వక క్షమాపణలు.

ఎవరి మనోభావాలను గాయపరచడం లేదా రెచ్చగొట్టడం దీని ఉద్దేశ్యం కాదు. ఒక చిత్రనిర్మాతగా, మన సైనికులు మరియు నాయకత్వం యొక్క ధైర్యం, త్యాగం మరియు బలం నన్ను కదిలించింది మరియు ఈ శక్తివంతమైన కథను వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే కోరుకున్నాను. ఈ ప్రాజెక్ట్ మన దేశం పట్ల లోతైన గౌరవం మరియు ప్రేమ నుండి పుట్టింది, కీర్తి లేదా డబ్బు ఆర్జన కోసం కాదు ”అంటూ నోట్లో వెల్లడించారు. 

ఆపరేషన్ సిందూర్ టైటిల్:

ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం ఒకటి, రెండు సంస్థలు కాదు సుమారు 15 నిర్మాణ సంస్థలు  పోటీలో ఉన్నాయి. టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లు కూడా ఆ టైటిల్ కోసం పోటీ పడుతున్న జాబితాలో ఉన్నాయి.

ఈ మేరకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో నిర్మాతలు దరఖాస్తు చేసినట్లు బాలీఫుడ్ మీడియా పేర్కొంది. మహావీర్ జైన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఈ టైటిల్ కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంది.

ఆపరేషన్ సిందూర్ టైటిట్ కోసం దరఖాస్తు చేసుకున్న జియో స్టూడియోస్.. ఆ తర్వాత తన అప్లికేషన్ ను విత్ డ్రా చేసుకుంది. తమ అనుమతి లేకుండా ఒకరు కంపెనీ తరుపన దరఖాస్తు చేసినట్లు చెప్పింది. ఇన్ని సంస్థలు పోటీ పడుతున్న టైటిల్ ఎవరిని వరించనుందో? సినిమా కథ ఎలా ఉంటుందో? ఎప్పటిలోగా తెరకెక్కిస్తారో వేచిచూడాలి.