బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. ఈ ఉత్కంఠభరిత ప్రయాణంలో మరికొన్ని వారాలు మాత్రమే ఆట మిగిలి ఉంది. ఈ తరుణంలో హౌస్‌మేట్స్ మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. టాప్ 5లో నిలవాలని కొందరు, హౌస్‌లో సర్వైవ్ అవ్వాలని మరికొందరు, కెప్పెన్సీ కోసం కొందరు గట్టిగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం 82వ రోజు హౌస్‌లో జరిగిన చివరి కెప్టెన్సీ టాస్క్ మరింత రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
డాగర్ టాస్క్‌తో మంటలు!
కెప్టెన్సీ కంటెండర్లుగా దివ్య, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, రీతూ, సంజన, పవన్ డీమాన్ అర్హత సాధించారు. వీరిలో చివరి కెప్టెన్ ఎవరో తేల్చేందుకు బిగ్ బాస్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్సీ రేసులో లేని సభ్యులు - భరణి, సుమన్ శెట్టి, తనూజ - ఈ టాస్క్‌లో కీలక పాత్ర పోషించారు. బజర్ మోగిన వెంటనే వీరు డాగర్ అందుకుని, తాము కెప్టెన్‌గా చూడాలనుకునే కంటెండర్‌కు ఇవ్వాలి. డాగర్ అందుకున్న కంటెండర్, మిగిలిన వారిలో ఒకరిని ఎంచుకుని వారి బోర్డుకు కత్తి గుచ్చి, బలమైన కారణాలు చెప్పి రేసు నుంచి తప్పించాలి.
రీతూ వర్సెస్ సంజన
ముందుగా సుమన్ శెట్టి డాగర్ అందుకుని రీతూకి ఇచ్చారు. రీతూ వెంటనే దానిని సంజన బోర్డుకు గుచ్చి, ఆమెను రేసు నుంచి తప్పించింది. నువ్వు గేమ్ గురించి కాకుండా, హౌస్‌లో ఉన్నవారందరిపై 'బిలో ది బెల్ట్' పర్సనల్ విషయాలు మాట్లాడి.., నా క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయాలని చూశావు అని రీతూ తీవ్రంగా ఆరోపించింది. దీనికి సంజన ఏ మాత్రం తగ్గకుండా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అసలు నీ గేమ్ ఏముంది రీతూ? ఉదయాన్నే నువ్వు ఆ మూలకు పోతావ్, పవన్ ఇంకో మూలకి పోతాడు. కాసేపటికి మళ్లీ వచ్చి పవన్ తో ప్యాచ్ అప్ చేసుకుంటావ్... ఇంతకు మించి నీ గేమ్ ఏముంది? అంటూ రీతూ గాలి తీసింది. నేను రియల్‌గా, జెన్యూన్‌గా ఉన్నాను అని రీతూ వాదించగా, సంజన కోసం తను జుట్టు త్యాగం చేసినందుకు బాధపడింది. ఈ వాగ్వాదం హౌస్‌లో మరింత హీట్ ను పెంచింది.
పవన్ వర్సెస్ ఇమ్మాన్యుయేల్
తరువాత భరణి డాగర్ అందుకుని పవన్ చేతికి ఇచ్చారు. పవన్... ఇమ్మాన్యుయేల్‌ను రేసు నుంచి తప్పిస్తూ, గతంలో తాను సాయం అడిగినప్పుడు ఇమ్మాన్యుయేల్ మద్దతు ఇవ్వలేదన్న పాయింట్‌ను లేవనెత్తాడు. ఈ మాటలకు ఇమ్మాన్యుయేల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. అన్నా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తాది. నువ్వు నవ్వితే నవ్వు వస్తాది... ఇలాంటి సొల్లు మాటలు నాకు చెప్పకురా.. పాయింట్లు లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పు, కానీ ఈ ఎమోషనల్ డ్రామా వద్దు అంటూ తన మెడలో ఉన్న బోర్డును విసిరికొట్టాడు. ఇమ్మాన్యుయేల్ సహనం కోల్పోయి, అరుస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
సీజన్ 9 చివరి కెప్టెన్ కల్యాణే!
ఒకానొక దశలో డీమాన్ పవన్ కెప్టెన్ అయినట్లు లీకులు వచ్చినా.. చివరి పోరులో అనూహ్యమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వాదోపవాదాలు, ఎలిమినేషన్స్ అనంతరం పవన్, కల్యాణ్‌లు మాత్రమే చివరి కెప్టెన్సీ రేసులో మిగిలారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం,.. వీరిద్దరి మధ్య జరిగిన తుది పోటీలో కల్యాణ్ పడాల విజయం సాధించి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి చివరి కెప్టెన్ అయ్యాడు. 'ఫైర్ స్ట్రామ్' టాస్క్ సమయంలో తొలిసారి కెప్టెన్ అయిన కల్యాణ్, ఇప్పుడు సీజన్‌కి చివరి కెప్టెన్‌గా నిలవడం అతని అభిమానులకు గొప్ప కిక్ ఇచ్చే వార్తే. ఈ ఆఖరి కెప్టెన్సీ టాస్క్‌తో హౌస్ దద్దరిల్లింది అనడంలో సందేహం లేదు. మరో రెండు వారాల్లో ఫినాలే ఉన్న నేపథ్యంలో, ఈ కెప్టెన్సీ మార్పు , సభ్యుల మధ్య పెరిగిన వైరం, ఆటను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
