అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా

అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా
  • అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా
  • మళ్లీ ఓటర్ల జాబితా సవరణకు ఈసీ షెడ్యూల్​
  • వచ్చే నెల 23 నుంచి బీఎల్​ఓల ఇంటింటి పరిశీలన


హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాదే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. ఈ మేరకు రెండో స్పెషల్​ సమ్మరీ రివిజన్​ను ఈసీ ప్రకటించింది. వచ్చే అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండినోళ్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని  సూచించింది. ఎన్నికల కమిషన్​ అధికార వెబ్​సైట్​ www.nvsp.in  ద్వారా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. జూన్​ 23 వరకు బీఎల్​ఓల ద్వారా ఇంటింటి పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపింది. జూన్ 24 నుంచి జులై 27 వరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, డబుల్​ఎంట్రీల తొలగింపు తదితర ప్రక్రియ పూర్తి చేయనుంది.

అనంతరం ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనుంది. దీనిపై ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించింది. ఏమైనా సమస్యలు, లోపాలు తలెత్తితే వాటి పరిష్కారానికి సెప్టెంబర్​ 2 వరకు గడువిచ్చింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 4న రాష్ట్ర ఓటర్ల తుది జాబితా ప్రకటించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను ఈసీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసీఐఎల్ ఇంజినీర్ల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్​ లెవెల్​ చెకింగ్​పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

డీఈఓలు, ఎఫ్ఎల్సీ విధానం, సింబల్ నమోదు విధానం, డిప్యూటీ డీఈఓల బాధ్యతలు, వీవీ ప్యాట్స్ వినియోగాన్ని వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రతి జిల్లాలో 18 మంది నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్ర చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​ వికాస్ రాజ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారన్నారు.