కేంద్రం నుంచి ఇంకా 24 వేల కోట్లు రావాలి

కేంద్రం నుంచి ఇంకా  24 వేల కోట్లు రావాలి

పెండింగ్‌‌లో మరో రూ.5 వేల కోట్ల జీఎస్టీ నిధులు

    మున్సిపాలిటీలకు రూ.1,428 కోట్లు రావాలె

    స్టేట్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్ రాజేశం గౌడ్‌‌

    రాష్ట్రంపై కేంద్రం వివక్ష

    రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్

కేంద్రం నుంచి మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ స్టేట్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్ రాజేశం గౌడ్‌‌ తెలిపారు. గడిచిన ఆరేళ్లలో రూ.లక్షన్నర కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిందని, ఆ నిధులన్నీ రూల్స్‌‌ ప్రకారం రావాల్సినవేనన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి జీఎస్‌‌టీ, ఇతర పన్నుల రూపంలో అధిక మొత్తం వెళుతున్నా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావడంతో ఆలస్యం జరుగుతోందని మంగళవారం రిలీజ్‌‌ చేసిన ప్రకటనలో ఆరోపించారు. నీతి ఆయోగ్‌‌ సిఫార్సులను కేంద్రం అమలు చేయడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు జాతీయ హోదా ఇవ్వలేదని, 2014-–15లో జీఎస్‌‌టీలో రాష్ట్రం 14 శాతం వృద్ధి రేటు సాధించిందని, కానీ రాష్ట్రానికి జీఎస్టీ కింద రావాల్సిన రూ.5 వేల కోట్లను ఇంకా విడుదల చేయలేదన్నారు. ఇవి కాకుండా మున్సిపాలిటీకు రూ.1,428 కోట్లు, ఇతర నిధులు రూ.3,100 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆరేళ్లుగా కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల కింద ఎలాంటి నిధులు మంజూరు కాలేదన్నారు.

ఏడాదికి సగటున ఇచ్చింది రూ.25 వేల కోట్లే

రాష్ట్రానికి కేంద్రం ఏడాదికి సగటున రూ.25 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఇప్పటికైనా గోబెల్స్‌‌ ప్రచారాన్ని కట్టిపెట్టాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దుష్ప్రచారం మానుకోవాలన్నారు. మొదటి నుంచి రాష్ట్ర రెవెన్యూ మిగులే ఉందని, పరిమితిలోనే ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీల నాయకులు చేస్తున్నది విష ప్రచారమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా వెల్లడించిన వాస్తవాలతో తేలిపోయిందన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా రాష్ట్రానికి రూ.450 కోట్లు వచ్చేవని, కానీ ఈసారి బడ్జెట్‌‌లో ఆ నిధులకు కేంద్రం కోత పెట్టిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు.