- రెండు జిల్లాల్లోనే మూడొందలు
- భారీగా తగ్గిన టీచర్ పోస్టులు
- 10 జిల్లాల్లో వందలోపే ఖాళీలు
- అత్యధికంగా హైదరాబాద్ లో 358,
- అత్యల్పంగా పెద్దపల్లిలో 43
- 5,089 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,089 టీచర్‌పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు శుక్రవారం జీవో నంబర్ 96 విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,739, ఎస్జీటీ 2,575, లాంగ్వేజీ పండిట్ 611, పీఈటీ పోస్టులు 164 భర్తీ చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ ద్వారా రిక్రూట్ మెంట్ చేపట్టనున్నట్టు తెలిపారు. అయితే రాష్ట్రంలో టీచర్ పోస్టుల సంఖ్య భారీగా తగ్గింది.
దాదాపు 4 వేల వరకు పోస్టులను తగ్గించినట్టు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,089 రెగ్యులర్ టీచర్పోస్టుల్లో కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే మూడొందలకు పైగా ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 358, నిజామాబాద్ లో 309 ఉండగా.. అత్యల్పంగా పెద్దపల్లిలో 43 పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 200కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇక హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్, ములుగు, పెదపల్లి, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో అయితే వందలోపే పోస్టులు ఉన్నాయి.
ఎక్కడ ఎక్కువంటే?
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్యధికంగా హైదరాబాద్ లో 116, వికారాబాద్ లో 102 ఉండగా.. అత్యల్పంగా భూపాలపల్లిలో 12, ములుగు, నిర్మల్ జిల్లాల్లో 16 చొప్పున ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 214, ఆదిలాబాద్‌లో 206 ఉండగా.. అత్యల్పంగా పెద్దపల్లిలో 7, వనపర్తిలో 19 ఉన్నాయి. లాంగ్వేజీ పండిట్ పోస్టులు అత్యధికంగా హైదరాబాద్‌లో 57 ఉండగా, అత్యల్పంగా నిర్మల్‌లో 4 ఉన్నాయి. హనుమకొండ, పెద్దపల్లిలో ఐదేసి.. భద్రాద్రి, మేడ్చల్ జిల్లాల్లో ఏడు చొప్పున పోస్టులు ఉన్నాయి. పీఈటీ పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 22, ఖమ్మంలో 10 పోస్టులు ఉండగా.. వికారాబాద్ లో ఒక్క పోస్టు కూడా లేదు. భద్రాద్రి, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, పెదపల్లి తదితర జిల్లాల్లో ఒక్కో పోస్టు మాత్రమే ఖాళీ ఉంది.
రిజర్వేషన్లపై సస్పెన్స్..
టీచర్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ పోస్టులను వర్టికల్ విధానంలోనా? లేక హారిజంటల్ విధానంలో భర్తీ చేస్తారా? అనే దానిపై సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని పోస్టులకు వర్టికల్ విధానంలోనే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో గ్రూప్1 నోటిఫికేషన్‌పై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హారిజంటల్ విధానాన్ని అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వర్టికల్ విధానం అమలు చేస్తారా? లేక హైకోర్టు తీర్పు ప్రకారం హారిజంటల్ విధానం కొనసాగిస్తారా? చూడాలి.