1,433 జాబ్స్కు ​ఆర్థిక శాఖ అనుమతి

1,433 జాబ్స్కు ​ఆర్థిక శాఖ అనుమతి
  • మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖల్లో ఉద్యోగాలు
  • ఇప్పటి వరకు మొత్తం 35,220 పోస్టుల భర్తీకి పర్మిషన్ 

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్​మెంట్ డిపార్ట్ మెంట్లలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టెక్నికల్​ఆఫీసర్, జూనియర్​టెక్నికల్​ఆఫీసర్, జూనియర్​ అసిస్టెంట్, హెల్త్​అసిస్టెంట్, శానిటరీ ఇన్​స్పెక్టర్, టౌన్​ ప్లానింగ్​ బిల్డింగ్ ఓవర్ సీర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటికే గ్రూప్ 1, పోలీసు, ట్రాన్స్ పోర్ట్, ఫారెస్ట్, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్ తదితర శాఖల్లోని 33,787 పోస్టుల కు అనుమతి ఇచ్చింది. తాజాగా 1,433 పోస్టులకు ఓకే చెప్పడంతో ఆర్థిక శాఖ అనుమతి లభించిన ఉద్యోగాల సంఖ్య 35,220కి చేరింది.

ఆరోగ్య శాఖలో 10 వేల పోస్టులు

ఆరోగ్య శాఖలోని 10,028 ఖాళీలు నింపేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్​ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేటగిరీ 1లో స్పెషలిస్టు డాక్టర్లు (అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు తదితరులు), కేటగిరీ 2లో ఎంబీబీఎస్​ డాక్టర్లు (సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓలు తదితరులు), కేటగిరీ 3లో స్టాఫ్ నర్సులు, కేటగిరీ 4లో ఎంపీహెచ్ఏ ఫిమేల్/ఏఎన్ఎంలను భర్తీ చేయనున్నారు. కేటగిరీ 1లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లను పోస్ట్ గ్రాడ్యుయేట్‌‌‌‌లోని పర్సంటేజ్ ఆధారంగా తీసుకోనున్నారు. ఆరోగ్య శాఖలో మొత్తం 12,775 ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిలో 10,028 పోస్టులను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మొదటి విడతలో 1,326 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.