రూ. 39,44,909 కోట్ల కేంద్ర బడ్జెట్

రూ. 39,44,909 కోట్ల కేంద్ర బడ్జెట్
  • రూ. 39,44,909కోట్ల కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టిన నిర్మల
  • హెల్త్​ మిషన్​కు రూ. 37,800 కోట్లు
  • కొత్తగా నేషనల్​ టెలి మెంటల్​ హెల్త్​ ప్రోగ్రామ్​
  • పంటల మద్దతు ధర కోసం రూ.2.37 లక్షల కోట్లు
  • పన్ను శ్లాబుల్లో మార్పుల్లేవ్​..క్రిప్టోలపై 30 % పన్ను
  • డిఫెన్స్​లో లోకల్ వెపన్స్​ తయారీకి ప్రయార్టీ
  • గోదావరి -- కృష్ణా నదుల అనుసంధానం

కరోనాతో దెబ్బతిన్న ఎకానమీని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్​ తొవ్వను ఎంచుకుంది. వ్యవసాయం, చదువులు, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి.. ఇట్లా దాదాపు అన్ని రంగాలకు టెక్నాలజీని జోడించింది. రూ. 39,44,909 కోట్లతో 2022-23 కేంద్ర బడ్జెట్​ను మంగళవారం పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. రాబోయే 25 ఏండ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్​ పునాదిలాంటిదని ఆమె అన్నారు. ఈ ఏడాది డిజిటల్​ రూపీని మార్కెట్​లోకి విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని, డిజిటల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘వన్​ క్లాస్​-వన్​ టీవీ చానల్​’ ప్రోగ్రామ్​ను విస్తరిస్తామని, ఇప్పటిదాకా పాఠాలు చెప్తున్న 12 చానళ్లను 200కు పెంచుతామంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు టెలి మెడిసిన్​ సేవలు అందిస్తామని పేర్కొంది. పేదలకు ఇండ్లు, ఇంటింటికీ నీళ్లు అందజేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పింది.

అమృతకాలానికి పునాది
రాబోయే 25 ఏండ్లకు ఈ బడ్జెట్​ బ్లూ ప్రింట్​
న్యూఢిల్లీ: రాబోయే 25 ఏండ్లలో దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయని నిర్మలా సీతారామన్​ చెప్పారు. కరోనా నుంచి దేశం కోలుకుంటున్నదని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సినేషన్​ క్యాంపెయిన్​ ఎంతో తోడ్పడుతున్నదన్నారు. గత రెండేండ్లలో కరోనా వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను చాలెంజ్​గా తీసుకొని డెవలప్​ చేసుకున్నామని చెప్పారు.  2014 నుంచి తమ ప్రభుత్వం ప్రజల సాధికారతకు, మరీ ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజల అభివృద్ధిపై ఫోకస్​ పెట్టిందని, ఈ బడ్జెట్​ కూడా అందులో భాగమేనని ఆమె వివరించారు. పక్కా ఇండ్లు, ఎలక్ట్రిసిటీ, కుకింగ్​ గ్యాస్​, మంచినీటి సరఫరా ఇలా అన్ని రకాల సౌకర్యాలు జనానికి అందజేస్తున్నామని.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు అన్నిరంగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్​ నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా తీసుకువచ్చామని, 1. పీఎం గతిశక్తి, 2. సంఘటిత అభివృద్ధి, 3. ఉత్పత్తి ఆధారిత పెట్టుబడులు, అవకాశాలు, శక్తి వనరులు, వాతావరణ మార్పులు, 4.  పరిశ్రమలకు ఆర్థిక ప్రయోజనం.. అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​ స్కీంతో దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, మున్ముందు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతంగా కొనసాగుతున్నదని తెలిపారు. కరోనా నుంచి పాఠాలు నేర్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామన్నారు. త్వరలోనే ఎల్​ఐసీ పబ్లిక్​ ఇష్యూ రాబోతున్నదని వెల్లడించారు.

అన్ని రంగాలకు చేయూత
అన్ని రంగాలకు ఈ బడ్జెట్​లో చేయూతనందిస్తున్నామని నిర్మల చెప్పారు. రైల్వేలో ‘వన్​ స్టేషన్​– వన్​ ప్రొడక్షన్’​ ద్వారా లోకల్ బిజినెస్ డెవలప్​ అవుతుందన్నారు. రాబోయే మూడేండ్లలో 400 న్యూ జనరేషన్​ వందే భారత్​ రైళ్లను తీసుకువస్తామని వివరించారు. రసాయనాల రహిత వ్యవసాయానికి (కెమికల్​ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్)ను ప్రోత్సహిస్తామన్నారు. ఐదు నదుల అనుసంధానికి డ్రాఫ్ట్​ డీపీఆర్​లు ఫైనల్​ అయ్యాయని, ఇందులో దామన్​గంగా‌‌– పింజల్, పర్​ తాపి– నర్మదా, గోదావరి – కృష్ణా, కృష్ణా – పెన్నా, పెన్నా – కావేరీ ఉన్నాయని వివరించారు. వ్యవసాయంలో కూడా స్టార్టప్స్​ను ప్రోత్సహిస్తామని, ఇందుకు ముందుకు వచ్చే వారికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు. రెండేండ్లుగా కరోనా ప్యాండమిక్​ వల్ల విద్యా వ్యవస్థ ఆగమైందని, రూరల్​ ఏరియాల్లోని పిల్లలు చదువుకు దూరమయ్యారని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సరైన విద్య అందించేందుకు ఈ బడ్జెట్​లో ‘పీఎం ఈ–విద్య’లో భాగంగా ‘వన్​ క్లాస్​– వన్​ టీవీ చానల్​’ ప్రోగ్రామ్​ ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. 2 లక్షల అంగన్​వాడీ కేంద్రాలను అప్​గ్రేడ్​ చేస్తామని చెప్పారు. ‘హర్​ ఘర్​–నాల్​ జల్’ కోసం రూ. 60 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో 3.8 కోట్ల ఇండ్లకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు.  వచ్చే ఆర్థిక సంవత్సరం 80 లక్షల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా రూ. 40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.  దేశంలో అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్​ సేవలు అందుబాటులోకి తెస్తామని, దీని వల్ల రూరల్​ ఏరియాల్లో ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్​ బ్యాంకింగ్​ను ప్రోత్సహిస్తున్నామని, డిజిటల్​ రూపీని తీసుకురాబోతున్నట్లు వివరించారు.  దేశంలో ఎక్కడి నుంచైనా ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ చేసుకునేలా ‘వన్​ నేషన్​– వన్​ రిజిస్ట్రేషన్​ సాఫ్ట్​వేర్​’ ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులకు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. త్వరలోనే ప్రైవేట్​ భాగస్వామ్యంతో 5 జీ టెలికాం సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.