నిజంగా సుకన్య సమృద్ధి యోజన మీ బిడ్డకు రూ.69 లక్షలు ఇవ్వదు..! ఇవే అసలు లెక్కలు!

నిజంగా సుకన్య సమృద్ధి యోజన మీ బిడ్డకు రూ.69 లక్షలు ఇవ్వదు..! ఇవే అసలు లెక్కలు!

Sukanya Samriddhi Yojana: ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టింది అనగానే ఆమె భవిష్యత్తు ఆర్థికంగా సుస్థిరంగా, భద్రతను కలిగించాలని తల్లిదండ్రులు అనుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది చేసే మెుదటి పని సదరు బిడ్డ పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకం ఓపెన్ చేయటమే. ప్రధానంగా భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఆలోచన, ప్రణాళిక ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనిపై ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ ఇచ్చిన సమాచారాన్ని కూడా వారు పరిశీలించటం ముఖ్యం. 

వాస్తవానికి చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ది స్కీమ్ ఓపెన్ చేయటానికి కారణం గరిష్ఠంగా రూ.69 లక్షలు రాబడిని పొందే అవకాశం ఉండటమే. అయితే ఆకర్షనీయంగా కనిపించే ఈ పెద్ద అంకెల గారడీ గురించి గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గౌరవ్ ముంద్ర ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. 21 ఏళ్ల తర్వాత రూ.69 లక్షలను ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకున్న తర్వాత వాస్తవంగా ఈ రోజు రూపాయి విలువ లెక్కన కేవలం రూ.17 లక్షల విలువను కలిగి ఉంటుందని తెలిపారు. 

ALSO READ : ట్యాక్స్ హంటింగ్..!! ఏపీలోని బజ్జీలు, బోండాలు, టిఫిన్ షాపుల్లోని UPI పేమెంట్స్‌పై GST ఆరా

ఇదే క్రమంలో తల్లిదండ్రులు మ్యూచువల్ ఫండ్స్ కి ప్రత్యామ్నాయంగా అయితే సుకన్య సమృద్ధి స్కీమ్ లేదా వారి పిల్లల కోసం ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ కోసం వెళుతున్నారు. ఈ క్రమంలో సుకన్య స్కీమ్ కోసం 15 ఏళ్ల పాటు రూ.లక్ష 50వేలు వారు చెల్లిస్తున్నారు. అలాగే వాత్సల్య స్కీమ్ విషయానికి వస్తే చివరికి రూ.కోటి 40 లక్షలు వస్తాయని భావిస్తున్నప్పటికీ 21 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే అంతిమంగా దాని విలువ ఈ రోజు లెక్కల ప్రకారం రూ.8లక్షల 40వేలకు సమానంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. 

ఎప్పుడో పెద్ద మెుత్తంలో డబ్బు వస్తుందని ఆకర్షనీయంగా ఉన్న స్కీమ్స్ వాస్తవంగా ఈ రోజు లెక్కల ప్రకారం అప్పుడు పిల్లలకు రూ.8లక్షల లేదా రూ.17 లక్షలను అందిస్తాయి పైన పేర్కొన్న రెండు స్కీమ్స్. వాస్తవానికి ఇవి వారి అప్పటి విద్యా ఖర్చులు, పెళ్లి ఖర్చులకు సరిపోతాయా అనే అంశాన్ని కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని గౌరవ్ సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో వచ్చే రాబడిని ద్రవ్యోల్బణం తినేస్తుందని, అప్పుడు వాస్తవంగా వాటి విలువ కొనుగోలు శక్తి రూపంలోకి మార్చినప్పుడు చాలా తగ్గుతుందని ఈ లెక్కలు చెబుతున్నాయి.

పిల్లలకు మంచి ఆదాయం ఇచ్చే పెట్టుబడి ప్లాన్ ఇదే..
అయితే చిల్డ్రన్ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల పైన పేర్కొన్న రెండు స్కీమ్స్ కంటే మెరుగైన మెుత్తాన్ని పిల్లలకు భవిష్యత్తులో అందించవచ్చని గౌరవ్ సూచించారు. ఇందుకోసం వార్షికంగా 12 శాతం రిటర్న్ అందించే స్కీములో తల్లిదండ్రులు పెట్టుబడి పెడితే రెండు దశాబ్ధాల తర్వాత ఆ మెుత్తం కోటి 40 లక్షల రూపాయలవుతుందని, పన్నుల తర్వాత రూ.కోటి 20 లక్షలు చేతికొస్తుందన్నారు.  ఆ మెుత్తాన్ని ఇప్పటి విలువకు మార్చుకున్నా రూ.34 లక్షలుగా దాని విలువ ఉంటుందనని పేర్కొన్నారు. ఎంత ఎక్కువ డబ్బు కోసం ప్లాన్ చేస్తున్నాం అనే దానికంటే వాస్తవంగా దాని విలువ ఎంత అనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యమని గౌరవ్ అన్నారు. అంటే ఇప్పుడు దాచే డబ్బు భవిష్యత్తులో పిల్లలకు తగిన కొనుగోలు శక్తిని అందించాలని ఆయన అంటున్నారు.