అప్పు తీర్చకుంటే కిడ్నీలు అమ్మేస్తాం

అప్పు తీర్చకుంటే కిడ్నీలు అమ్మేస్తాం

రాజేంద్రనగర్, వెలుగు: అప్పు తీర్చకుంటే కిడ్నీలు తీసుకుంటామని ఫైనాన్షియర్ లు బెదిరిస్తున్నారని ఓ బాధితుడు శుక్రవారం మైలార్ దేవ్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే..శాస్త్రిపురంలోని ముస్తఫానగర్ కి చెందిన అక్రమ్(47) తాడ్ బన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్, ఒమర్ అనే ఇద్దరు ఫైనాన్షియర్ల దగ్గరి నుంచి 3 నెలల క్రితం రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు ప్రతి నెలా అక్రమ్ వారికి వడ్డీ చెల్లిస్తున్నాడు.అదే సమయంలో వారి దగ్గరి నుంచే అక్రమ్ రూ.2.5లక్షల చిట్టీ ఎత్తుకుని ఆ డబ్బులు కూడా తీసుకున్నాడు. మొత్తం ఫైనాన్షియర్ల దగ్గరి నుంచి రూ.4.5లక్షలు తీసుకున్న అక్రమ్ వారికి ప్రతి నెలా రూ.80వేలు కడుతున్నాడు. అయితే గత నెల అక్రమ్ కి అనారోగ్యానికి గురవడంతో ఫైనాన్షియర్లకు రూ.40వేలు మాత్రమే చెల్లించాడు. మిగతా రూ.40 వేలు తర్వాత కడతానని చెప్పాడు. దీంతో అక్రమ్ తీసుకున్న మొత్తం డబ్బులు రూ.4.5లక్షలను ఒకేసారి తిరిగిచ్చేయాలని ఫైనాన్షియర్లు మహ్మద్, ఒమర్ అతడిని వేధించారు. లేకపోతే అక్రమ్ రెండు కిడ్నీలు తీసుకుని అమ్ముకుంటామని అతడి కుటుంబసభ్యులను ఫైనాన్షియర్లు బెదిరించడంతో..అక్రమ్ శుక్రవారం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.