పోటీ పరీక్షలకు మెటీరియల్​ దొరకట్లే!

పోటీ పరీక్షలకు మెటీరియల్​ దొరకట్లే!

పాతవాటినే డబుల్​ రేట్లకు అమ్ముతున్న వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: సిటీలోని కోచింగ్ సెంటర్లు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులతో కిటకిటలాడుతుండగా, సంబంధిత పుస్తకాలు దొరకడం లేదు. మార్చిలో ఉద్యోగాల ప్రకటనతో తెలుగు అకాడమీలోని పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఫండ్స్, కాగితం కొరతతో అకాడమీ ముద్రణ మొదలుపెట్టలేదు. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మెటీరియల్​దొరకడం కష్టంగా మారింది. నెలరోజుల నుంచి అభ్యర్థులు ఎదురుచూస్తున్నా ఇంకా పుస్తకాలు అందుబాటులోకి రాలేదు. బయట బుక్ స్టోర్లలోనూ కాంపిటీటివ్ పుస్తకాల కొరత తీవ్రంగా ఉంది. కొన్నిరకాల పుస్తకాలు పాతవే అందుబాటులో ఉండగా, వాటికి కూడా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు రెండు, మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారు. ఆన్​లైన్, ఇతర పబ్లికేషన్ల నుంచైనా ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌ చేద్దామంటే అక్కడా రేట్లు పెంచేశారని, అన్ని పుస్తకాలు దొరకడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు కూడా మెటీరియల్ లేదని చెబుతుండడంతో అభ్యర్థులు 
పుస్తకాల కోసం నానా తంటాలు పడుతున్నారు. 
 

అభ్యర్థుల ఎదురుచూపులు
స్టూడెంట్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా అందరూ ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే సిటీలోని కోచింగ్ సెంటర్లు, ఆన్​లైన్ అకాడమీలు అభ్యర్థులతో నిండిపోయాయి. అయితే పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు నోటిఫికేషన్లు పడుతుండటం, మరోవైపు కావాల్సిన పుస్తకాలు లేకపోవడంతో క్యాండిడేట్లు తలలు పట్టుకుంటున్నారు. టెట్, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్ కు పోటీ పడుతున్నవారికి అవసరమైన బుక్స్​ మార్కెట్​లో లేవు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యమం,- రాష్ట్ర అవతరణ, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికాభివృద్ధి-.. పర్యావరణం, రాష్ట్ర చరిత్ర -సంస్కృతి,  జనరల్‌‌‌‌ స్టడీస్‌‌‌‌, భారత రాజ్యాంగం తదితర 20 రకాల పుస్తకాలకు  డిమాండ్ అధికంగా ఉంది. చాలామంది కొత్త పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్నారు. అవి దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ పుస్తకాల వేటలో పడుతున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డిమాండ్ పెరగడంతో కొన్ని బుక్ స్టోర్లు పుస్తకాలను గతంతో పోలిస్తే రెండు, మూడు రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. గతంలో క్వశ్చన్ పేపర్ మోడల్ బుక్ లెట్ రూ. 250 ఉంటే ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 ఉందని ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు పోటీపడుతున్న అభ్యర్థి ఉదయ్ తెలిపారు. 
 

క్లాసులు వింటూ.. ఆన్​లైన్​లో చూసి..
నోటిఫికేషన్లు పడుతున్నా పుస్తకాల కొరత ఇంకా వెంటాడుతుండటంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు వీలైనంత తొందరగా మార్కెట్ లోకి తీసుకురావాలని కోరుతున్నారు. అభ్యర్థుల అవసరాన్ని గుర్తించిన బుక్ స్టోర్‌‌‌‌‌‌‌‌లు, ఇతర పబ్లికేషన్లు రేట్లు ఎక్కువ చేసి అమ్ముతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కోఠి, అబిడ్స్ లోని బుక్ స్టోర్‌‌‌‌‌‌‌‌లు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. మార్కెట్‌‌‌‌లోనూ మెటీరియల్​ దొరకకపోవడంతో అభ్యర్థులు కోచింగ్ క్లాసులు వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పాత పుస్తకాలు, మెటీరియల్ ఉన్నవారి దగ్గర తీసుకుని జిరాక్స్​లు, స్పైరల్ బైండింగ్ చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఆన్​లైన్ వెబ్ సైట్లలో షార్ట్ నోట్స్, మెటీరియల్స్ వెతుక్కొని చదువుకుంటున్నామని చెప్తున్నారు.