మాస్క్​ పెట్టుకోకుంటే రూ.వెయ్యి ఫైన్

మాస్క్​ పెట్టుకోకుంటే రూ.వెయ్యి ఫైన్
  • కేసులు కూడా నమోదు చేస్తున్రు
  • రంగంలోకి పోలీసులు.. ముమ్మరంగా తనిఖీలు
  • సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఇండ్లకే చలాన్లు

వెలుగు నెట్​వర్క్: మాస్కు పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త! రూ.వెయ్యి ఫైన్​ పడుద్ది. బండి మీద రయ్యిమని పోతాం.. మాకేం కాదని అనుకోకండి. సీసీ కెమెరాల ఫుటేజీలు చూసి మరీ ఇండ్లకు చలాన్లు పంపిస్తున్నారు. కరోనా సెకండ్​వేవ్​ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కరోనా నిబంధనలు పాటించని వాళ్లకు, ముఖ్యంగా మాస్క్​ పెట్టుకోనివాళ్లకు రూ. వెయ్యి చొప్పున ఫైన్లు వేయడంతో పాటు డిజాస్టర్ ​మేనేజ్​మెంట్ యాక్ట్​, ఐపీసీ 188 ప్రకారం కేసులు కూడా పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఫైన్లు వేయడం, కేసులు పెట్టడం ప్రారంభం కాగా.. మిగిలిన జిల్లాల్లో బుధవారం నుంచి అమల్లోకి తెస్తామని పోలీస్​ఆఫీసర్లు చెబుతున్నారు. 

ఫిజికల్‌ డిస్టెన్స్ పాటించాల్సిందే..
కరోనా కేసులు పెరుగుతుండడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ల  వద్ద ఫిజికల్‌ డిస్టెన్స్​ పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు సూచిస్తున్నారు. గతంలో మాదిరి షాపుల ముందు సర్కిల్స్​ఏర్పాటు చేయాలని ఓనర్లను ఆదేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా ఎవరూ తిరగవద్దని, మాస్కు లేకుండా కనిపిస్తే డిజాస్టర్​ మేనేజ్​మెంట్ యాక్ట్​లోని 51 నుంచి 60 సెక్షన్ల కింద, ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు  మంగళవారం ఆయా జిల్లాల్లోని డీఐజీలు, సీపీలు, ఎస్పీలు ప్రెస్​నోట్లు​ రిలీజ్​చేశారు.  

ఫైన్లు వేసిన్రు.. కేసులు పెట్టిన్రు 
అధికారుల ఆదేశాలతో సివిల్​, ట్రాఫిక్​ పోలీసులు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా సిటీలు, పట్టణాలు, మండల కేంద్రాలపై ఫోకస్​ పెట్టారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ​ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఫైన్లు వేస్తున్నారు. ఖమ్మం జిల్లా పోలీసులు మంగళవారం మాస్కులు పెట్టుకోని 20 మందికి  రూ.వెయ్యి చొప్పున ఫైన్ వేశారు. సీసీ కెమెరాల్లో చూసి ఆన్​లైన్​ద్వారా చలానాను ఇంటికే పంపుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో మాస్కులు పెట్టుకోని 11 మంది మీద కేసులు పెట్టగా.. 54 మందికి కొన్ని చోట్ల రూ.200 చొప్పున, ఇంకొన్ని చోట్ల రూ. వెయ్యి చొప్పున ఫైన్​ వేశారు. యాదాద్రి జిల్లాలోనూ ఫైన్లు మొదలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు మాస్క్​ పెట్టుకోని వాళ్లకు రూ.వెయ్యి చొప్పున ఫైన్ వేస్తున్నారు. మహబూబ్ నగర్ లో ఈ వారం పాటు అవగాహన కల్పిస్తామని, తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు రూ.వెయ్యి చొప్పున ఫైన్​ వేస్తామని అక్కడి ట్రాఫిక్ ఎస్సై రాములు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ బుధ, గురువారాల నుంచి మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.వెయ్యి చొప్పున ఫైన్​ వేసే అవకాశం కనిపిస్తోంది.  

గ్రేటర్‌పై స్పెషల్ ఫోకస్ 
కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువున్న గ్రేటర్ హైదరాబాద్ పై మూడు కమిషనరేట్ల పోలీసులు ఫోకస్ పెట్టారు. పబ్లిక్ ప్లేసేస్, షాపింగ్‌‌మాల్స్‌‌, కూరగాయల మార్కెట్లలో బ్లూకోల్ట్స్‌ సిబ్బందితో స్పెషల్‌‌ డ్రైవ్‌‌ నిర్వహిస్తున్నారు. సుల్తాన్‌‌బజార్‌‌, కోఠి, మల్కాజిగిరి, ఎల్బీనగర్‌‌‌‌లో కరోనా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్‌‌ ఇస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఫైన్లు వేసేందుకు, కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ‘‘సెకండ్‌‌ వేవ్‌‌ కేసులు పెరుగుతున్నాయి. దాని ప్రభావం సిటీలో ఎక్కువగా ఉంటుంది. రూల్స్ కఠినంగా అమలు చేస్తాం. ఫైన్లు వేయడం, కేసులు పెట్టడం మా ఉద్దేశం కాదు. కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ నుంచి ప్రజలను అలర్ట్‌‌ చేయడమే మా డ్యూటీ. వారం రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు.