అంబులెన్స్ కు దారియ్యకుంటే రూ.10,000 ఫైన్‌‌

 అంబులెన్స్ కు దారియ్యకుంటే రూ.10,000 ఫైన్‌‌
  • డ్రంకెన్‌‌ డ్రైవ్‌ లో దొరికితే రూ.10,000
  • ఓవర్‌‌ లోడింగ్‌ కు 20 వేలపైమాటే వెహికల్‌‌ ఉన్నోళ్లందరికీ ఇన్సూరెన్స్‌
  • కొత్త మోటారు వాహన చట్టాన్ని తెస్తున్న కేంద్రం
  • లోక్‌‌సభలో సవరణ బిల్లు ఓకే,త్వరలో రాజ్యసభకు!

ఇకపై బండి చాలా జాగ్రత్తగా నడపాలి. ఏ మాత్రం కాస్త అటూఇటైనా జేబుకు భారీ చిల్లు తప్పదు. కొత్తగా అమల్లోకి రాబోతున్న ‘మోటార్‌‌ వెహికల్‌‌ సవరణ బిల్లు- 2019’తో ఫైన్ల మోత మోగనుంది. అంబులెన్స్‌‌కు దారివ్వకున్నా, డ్రంకన్‌‌ డ్రైవ్‌‌లో దొరికినా భారీగా ఫైన్‌‌ కట్టాల్సిందే. కొన్ని కేసుల్లోనైతే ఏకంగా ఊచలు లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మైనర్లకు బండిస్తే ఓనర్‌‌కు 25 వేల ఫైన్‌‌తోపాటు మూడేళ్ల జైలు శిక్ష వేస్తారు. ఆర్సీ కూడా రద్దవుతుంది. మద్యం తాగి, మత్తు పదార్థాలు తీసుకుని డ్రైవింగ్‌‌ చేస్తే ఇప్పటివరకున్న ఫైన్‌‌ రూ.2 వేలు. దాన్నిప్పుడు రూ.10 వేలకు పెంచారు.

త్వరలో రాజ్యసభకు బిల్లు

కేంద్రం ‘మోటార్‌‌ వెహికల్‌‌ సవరణ బిల్లు- 2019’ను లోక్‌‌సభలో ప్రవేశపెట్టింది. త్వరలో దీన్ని రాజ్యసభలోనూ పెడతారు. ఈ సవరణ బిల్లును 2017లోనే లోక్‌‌సభలో పెట్టి ఆమోదించగా, రాజ్యసభలో వీగిపోయింది. తాజాగా దీనికి మరికొన్ని సవరణలు చేసి తీసుకొచ్చారు.

తయారీ సంస్థలకూ మోతే..

ఏదైనా వెహికల్‌‌ తయారీ సంస్థ ప్రమాణాలు పాటించలేదని తేలితే రూ .100 కోట్ల వరకు జరిమానా లేదా ఓనర్‌‌కు ఏడాది జైలు పడనుంది. కొన్ని సందర్భాల్లో రెండూ పడే అవకాశముంది. రోడ్డు వేయడంలో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్‌‌కు లక్ష రూపాయల ఫైన్‌‌ వేస్తారు. ఈ జరిమానాలన్నింటినీ ప్రభుత్వం ఏటా 10% దాకా పెంచుకోవచ్చు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ట్రీట్‌‌మెంట్‌‌కోసం గోల్డెన్‌‌ అవర్‌‌ పథకంలో మార్పులు చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారమూ మారనుంది. ప్రమాదంలో చనిపోతే రెండు లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ .50 వేల వరకు చెల్లిస్తారు.

వెహికల్‌‌ ఉంటే ఇన్సూరెన్స్‌‌ ఉండాల్సిందే

కొత్త బిల్లు ప్రకారం ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్లను నియంత్రించే అధికారం ప్రభుత్వానికుంది. ఇప్పటివరకు చట్టంలో క్యాబ్ అగ్రిగేటర్లను గుర్తించలేదు. ఈ చట్టంలో ‘అగ్రిగేటర్స్’ అనే పదాన్ని చేర్చడం వల్ల ఆయా సంస్థలకు రూల్స్‌‌ రూపొందించడానికి, చర్యలు తీసుకోవడానికి కేంద్రానికి అధికారం ఉంటుంది. దేశంలోని వెహికల్‌‌ ఉన్న వారందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌‌ కల్పించడానికి ‘మోటారు వెహికల్‌‌ యాక్సిడెంట్‌‌ ఫండ్‌‌’ ఏర్పాటు కానుంది.  ప్రమాదాల్లో గాయపడిన వారికి ట్రీట్‌‌మెంట్‌‌, ‘హిట్ అండ్ రన్‌‌’లో చనిపోయిన పరిహారం ఈ ఫండ్‌‌ ద్వారా అందనుంది. ఈ బిల్లుతో ఆయా రాష్ట్రాల రవాణా శాఖలకూ భారీగా ఇన్‌‌కం రానుంది.