మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన ఐదు బైకులు

మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన ఐదు బైకులు

హైదరాబాద్: మలక్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు బైకులు మంటల్లో కాలిపోయాయి. ఊహించని ఈ అగ్ని ప్రమాదంతో మలక్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో మలక్ పేట్ మెట్రో పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

అగ్ని ప్రమాదానికి కారణంపై ఆరా తీయగా.. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ఒక బైక్ నుంచి మంటలు వచ్చాయని, ఆ మంటలు వ్యాపించి దగ్గర్లోని బైక్స్ కూడా మంటల్లో కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బందికి వాహనదారులు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Also Read:-చిన్న పాపను రేప్ చేసినోడికి.. పాతికేళ్ల జైలు..

ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో రాకపోకలపై ఈ అగ్ని ప్రమాదం ప్రభావం పడింది. మెట్రో ప్రయాణికులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపు మెట్రో స్టేషన్ లోకి వచ్చే వాళ్లు, వెళ్లే వాళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. మెట్రో స్టేషన్లో పనిచేసే ఉద్యోగులు భయాందోళన చెందారు. మలక్ పేట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగింది.