హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. దీపావళి వేళ స్వీట్ షాపులో లక్షల్లో నష్టం..

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. దీపావళి వేళ స్వీట్ షాపులో లక్షల్లో నష్టం..

దీపావళి పండగ వచ్చేసింది... దేశవ్యాప్తంగా క్రాకర్స్ షాపులు, స్వీట్ షాపులు, బట్టలు, జ్యువలరీ షాపులు కస్టమర్లతో సందడిగా మారాయి. ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏరియాలో క్రాకర్స్ షాపులు స్వీట్ షాపుల్లో పండగ సందడి కనిపిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో స్వీట్స్, బట్టల షాపుల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో పాతబస్తీలోని ఓ స్వీట్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ( అక్టోబర్ 17 ) జరిగిన ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోక్ క్లాక్ టవర్ సమీపంలో ఉన్న ఓ ఆప్టికల్ అండ్ స్వీట్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులోని లక్షలు విలువజేసే వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనలో లక్షలు విలువజేసే వస్తువులు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆస్థి నష్టం మినహా ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.