నిర్మల్ జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పొగ నిండుకుంది. శుక్రవారం ( మే 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఉన్న డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మొత్తం పొగ నిండుకొని పిల్లలు, పెద్దలకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది.
డంపింగ్ యార్డు వల్ల ఇబ్బంది పడుతున్నామని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు స్థానికులు.
పొగ కారణంగా పిల్లలు రాత్రంతా ముక్కు మూసుకుని గడపాల్సిన పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అగ్నిప్రమాదం వల్ల రాత్రి పొగతో ఇబ్బంది పడ్డామని అంటున్నారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు.
