- ఇల్లంతా వ్యాపించిన మంటలు
- గ్యాస్ సిలిండర్ పేలి, ఆపై అపార్ట్మెంట్లో అలజడి
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పరిధిలోని గాజులరామారంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అవెంచురిన్ అపార్ట్మెంట్లో నివసించే కరుణ అనే మహిళ.. బకెట్లో నీటిని వేడి చేసేందుకు ఎలక్ట్రిక్ హీటర్ వాడారు. నీళ్లు వేడయ్యాక హీటర్‌ను తీసి పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీపై పెట్టారు. అయితే, ఆ సమయంలో హీటర్ స్విచ్చాఫ్ చేయడం మర్చిపోవడంతో సెగకు కరిగి కుర్చీకి మంటలు చెలరేగాయి.
చూస్తుండగానే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ప్రాణభయంతో బయటకు పరుగులు తీయగా, మంటల ధాటికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. సెకండ్ ఫ్లోర్లోనూ మొత్తం మంటలు వ్యాపించి, పైన ఉన్న మూడో అంతస్తులోని గీజర్ కూడా పేలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గృహోపకరణాలన్నీ కాలిపోయినప్పటికీ.. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
