పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం

పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం

వారాంతపు సంత జరుగుతోంది. కూరగాయలు, ఇతరత్రా సామాన్లు కొనుక్కోవడానికి స్థానికులు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ బట్టల షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న సిలిండర్ పేలడంతో ప్రజలు ఉరుకులు పరుగులు తీశారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో సమీపంలో ఉన్న వారు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లిఖార్జున నగర్ లో ఓ బట్టల షాపు ఉంది. అందులోనే ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం ఒక్కసారిగా షాపులో మంటలు చెలరేగాయి. మంటలకు ఇంట్లోని సిలిండర్ పేలిపోయింది.

మంటలు వ్యాపించగానే అందులో ఉన్న వారు బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం విద్యుత్  షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని భావిస్తున్నారు.