
సికింద్రాబాద్ క్లబ్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో క్లబ్ పూర్తిగా తగలబడి పోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా కాలిపోయింది. 10 ఫైర్ ఇంజిన్లుతో మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. కరోనా కారణంగా చాలా రోజులు నుంచి క్లబ్ తెరవడం లేదు. ప్రమాదంలో సికింద్రాబాద్ క్లబ్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ప్రమాదంలో బ్రిటీష్ కాలంలో కట్టిన ప్రధాన బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది. బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం 1878 లో ఈ క్లబ్ ను 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ క్లబ్ ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ విడుదల చేశారు. ఇందులో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ క్లబ్ లో ఐదు వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.
తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ రెడ్డి అన్నారు. షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. మొత్తం 7 ఫైర్ ఇంజన్లు స్పాట్ కి కేవలం 15 నిమిషాల్లోనే రీచ్ అయ్యాయన్నారు.. క్లబ్ ముందు భాగం మొత్తం కూడా కలప , చెక్క తో కూడి ఉంది కాబట్టి ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందన్నారు. ఎంత మేరకు అస్తి నష్టం జరిగిందన్న విషయంపై భవనం ఇంజనీర్, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ద్వారా అంచనా వేస్తారన్నారు. ప్రయివేటు క్లబ్ కాబట్టే ఎవరిని లోపలకి అనుమతివ్వడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ క్లబ్ తో అనుబంధం ఉందని.. సుమారు 5వేల మందికి ఈ క్లబ్ లో మెంబర్ షిప్ ఉందన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందన్నారు.