12 గంటల్లోనే రెండో ప్రమాదం.. కోచ్‌లో చెలరేగిన మంటలు.. 19మందికి గాయాలు

12 గంటల్లోనే రెండో ప్రమాదం.. కోచ్‌లో చెలరేగిన మంటలు.. 19మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో నవంబర్ 16 తెల్లవారుజామున ఢిల్లీ-సహర్స వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. 12 గంటల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబర్ 15న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ-దర్భంగా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, న్యూఢిల్లీ నుంచి బీహార్‌లోని సహర్సాకు వెళుతున్న 12554 నంబర్ రైలులోని S-6 కోచ్‌లో గురువారం తెల్లవారుజామున 2:40 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీ-సహారసా వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం గుండా వెళుతుండగా ఈ మంటలు చెలరేగాయి.

పలప నివేదికల ప్రకారం, ఈ రోజు జరిగిన ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 11 మందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన వారిలో 11 మందిని చికిత్స నిమిత్తం సైఫాయి మెడికల్ యూనివర్సిటీకి తరలించగా, ఎనిమిది మందిని ప్రధాన కార్యాలయంలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే రైల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

"వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని S6 కోచ్‌లో మంటలు చెలరేగాయి. రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలును 30-35 నిమిషాల పాటు నిలిపివేసారు" అని ఇటావా రూరల్ ఎస్పీ సత్యపాల్ సింగ్ తెలిపారు.