హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి ఇస్లామియా హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీ రామ ఎంటర్ప్రైజెస్ షాప్(ప్లాస్టిక్ మెటీరియల్)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా ఫైర్ ఇంజన్స్ సహాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
భారీగా మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో మోండా మార్కెట్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
