
- బాణాసంచా షాపుల్లో నిబంధనలూ తుస్...
- ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం
- పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో ప్రజలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దీపావళి సందర్భంగా పటాకుల షాపుల ఏర్పాటుకు డబ్బులిస్తేనే ఆయా డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఎన్ఓసీలు ఇస్తున్నారు. మరోవైపు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించి లైసెన్సులు రాకుండానే పటాకుల అమ్మకాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రమాదం సంభవిస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.
రూ.కోట్లలో వ్యాపారం..
దీపావళి పండుగ సందర్భంగా పటాకుల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. కోట్లలో వ్యాపారం సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 125 నుంచి 150కి పైగా దరఖాస్తులు వస్తాయని ఆఫీసర్లు అంచానా వేస్తున్నారు. కాగా బాణసంచా షాపులు పెట్టుకునేందుకు వ్యాపారులు కార్పొరేషన్, మున్సిపాలిటీలతో పాటు మండలాల ఆఫీసులు, ఫైర్, పోలీస్, రెవెన్యూ ఆఫీసుల నుంచి ఎన్ఓసీలు తీసుకోని ఆర్డీఓ ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంది.
ఆర్డీఓ ఆఫీసుల నుంచి కలెక్టరేట్‌కు దరఖాస్తులు వెళ్లిన తర్వాత అక్కడ పరిశీలించి అధికారులు లైసెన్స్ ఇస్తారు. ఇదిలాఉండగా కొత్తగూడెంలో అన్ని డిపార్ట్ మెంట్లకు కలిపి దాదాపు రూ. 30వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మండలాల్లో రూ. 20వేల వరకు ఎన్ఓసీ, లైసెన్స్‌ల కోసం ఆఫీసర్లు తీసుకుంటున్నారు. ఒక్కో ఆఫీస్‌లో రూ. 3వేల నుంచి రూ. 8వేల వరకు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
దుకాణాల ఏర్పాటులో రూల్స్ ఏవీ..?
బాణసంచా దుకాణాలు స్కూల్స్, టెంపుల్స్, గృహనివాసాల మధ్య ఏర్పాటు చేయకూడదు. కానీ టేకులపల్లి మండలంలో రామాలయం ఆవరణలోనే బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో దాదాపు 44 షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో షాపు మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి, కానీసగం షాపులు మీటరు దూరంలోనే ఏర్పాటు చేశారు. మరో వైపు షాపుపకు పైకప్పుతో పాటు మూడు వైపులా ఆస్బెస్టాస్, సిమెంట్ రేకులు వేయాల్సి ఉంది. నిప్పుకు ఇబ్బంది లేని వాటితో షాపులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ కొత్తగూడెంలో మూడు వైపులా టార్పాలిన్లే ఏర్పాటు చేయడం గమనార్హం.
ప్రతి షాపు ముందు 200 లీటర్ల సామర్థ్యం గల రెండు వాటర్ డ్రమ్ములు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఒకటి చొప్పున మాత్రమే ఏర్పాటు చేశా ఒక్కో షాపులో 500కేజీల సామర్థ్యం గల బాణసంచా మాత్రమే ఉంచాల్సి ఉంది.. కానీ 700 కేజీల కు పైగాసామార్థ్యం వరకు బాణసంచాను షాపుల్లో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. చాలా వరకు లైసెన్స్‌లు రాకుండానే కొత్తగూడెంలో బాణసంచా అమ్మకాలను వ్యాపారులు కొనసాగిస్తున్నారు. దీనిపై ఫైర్ ఆఫీసర్లు పుల్లయ్య, కాంతి మాట్లాడుతూ బాణసంచా షాపులను నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ఓసీల కోసం ఆఫీసర్లు ఎవరి వద్ద డబ్బులు తీసుకోవడం లేదన్నారు.