తొలి స్వదేశీ యాంటీజెన్ కిట్‌కు ఐసీఎంఆర్ అప్రూవల్

తొలి స్వదేశీ యాంటీజెన్ కిట్‌కు ఐసీఎంఆర్ అప్రూవల్

న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కరోనాను గుర్తించే రెండో యాంటీజెన్ టెస్ట్‌ కిట్‌కు అనుమతిని ఇచ్చింది. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్‌ తయారు చేసిన ఈ కిట్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇండియాలో రూపొందించిన తొలి యాంటీజెన్ టెస్ట్‌ కిట్‌ ఇదే కానుంది. ప్యాథోక్యాచ్ కొవిడ్–19 యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌గా పిలిచే ఈ కిట్‌ను స్వదేశంలో తయారు చేశారు. వెంటనే మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న ఈ కిట్‌ ధర రూ.450గా ఖాయం చేశారు.

‘మహమ్మారిని ఎదుర్కోవడానికి సాధ్యమైన ప్రతి రీతిలో మైల్యాబ్ టీమ్ పని చేస్తోంది. ఫారెన్‌ కిట్స్‌ మీద ఆధారపడొద్దనే ఉద్దేశంతో ఆర్‌‌టీ–పీసీఆర్ కిట్‌లు రూపొందించిన తర్వాత కరోనా టెస్టింగ్స్‌ను పెంచడానికి కాంప్యాక్ట్‌ ఎక్స్‌ఎల్‌ను లాంచ్ చేశాం. ఇప్పుడు యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌కు ఆమోదం అందడంతో కరోనాపై పోరులో టెస్టింగ్‌ను భారీగా పెంచనున్నాం’ అని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఎండీ హస్ముఖ్ రావల్ చెప్పారు. మైల్యాబ్ యాంటీజెన్‌ కిట్‌ కంటే ముందు సౌత్ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్ తయారు చేసిన టెస్ట్ కిట్స్‌కు ఐసీఎంఆర్ అప్రూవల్ ఇచ్చింది. బయోసెన్సార్ బ్రాంచ్ హర్యానాలోని మానేసర్‌‌లో ఉంది.