బేగంపేట్ లో తొలి ఏవియేషన్ సెంటర్

బేగంపేట్ లో తొలి ఏవియేషన్ సెంటర్

తెలంగాణ ప్రజలు చూపించిన ప్రేమ తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.  ‘‘తెలంగాణలో రెండు రోజులు ఉన్నాను. బీజేపీపై ఇక్కడి ప్రజలకు ఉన్న విశ్వాసం చూసి నాకు మరింత సంతృప్తి కలిగింది. మీరు నా మీద చూపించిన ప్రేమకు రెండింతలు అభివృద్ధి రూపంలో తెలంగాణకు తిరిగి ఇస్తా. తెలంగాణ  ప్రజల విశ్వాసాన్ని,  ఆశీర్వాదాన్ని వృథా కానివ్వం. పార్లమెంట్​ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పటేల్​గూడలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. 

సభకు ముందు రూ.7,200 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. బేగంపేట ఎయిర్​పోర్టులో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ఏవియేషన్​సెంటర్​ను వర్చువల్ గా ప్రారంభించారు. నేషనల్​హైవేలు, రైల్వే లైన్లు, ఎయిర్​పోర్టులు, 6 కొత్త రైల్వే స్టేషన్ల బిల్డింగులు, విద్యుదీకరణ పూర్తి చేసుకున్న సనత్​నగర్, మౌలాలి, ఘట్కేసర్, లింగంపల్లి ఎంఎంటీఎస్ రైల్వే లైన్, ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన పారదీప్–హైదరాబాద్​ప్రొడక్ట్ లైన్ ను జాతికి అంకితమిచ్చారు. ఏవియేషన్ సెంటర్ తో​ఈ రంగంలో తెలంగాణకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ తెలిపారు. 

పదేండ్లలో ఎయిర్​పోర్ట్​ల సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పారు. వికసిత్ తెలంగాణ ద్వారా వికసిత్​భారత్​లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా సహాయం చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్​తమిళిసై, రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​పర్సన్​మంజుశ్రీ, కలెక్టర్​వల్లూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు కేంద్రం, రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో పటేల్ గూడ వద్ద మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు.