గుడ్ న్యూస్ : దేశంలోనే ఫస్ట్.. ఆ పెట్రోల్ బంకులో అందరూ మహిళలే

గుడ్ న్యూస్ : దేశంలోనే ఫస్ట్.. ఆ పెట్రోల్ బంకులో అందరూ మహిళలే

దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా మహిళా ఖైదీలే నిర్వహించే పెట్రోల్ బంక్ ను తమిళనాడు ప్రభుత్వం ఇటీవల  చెన్నైలోని  పుఝల్‌లోని జైలు కాంప్లెక్స్ ప్రాంగణంలోప్రారంభించింది.   ఖైదీలుగా ఉన్న మహిళలకు  ఉద్యోగాలు కల్పించినందుకు తమిళనాడు జైళ్ల శాఖ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటుంది. 

హత్యతో సహా వివిధ నేరాల కారణంగా ఏళ్ల తరబడి జైలులో ఉన్న ఈ మహిళలు...  ఖైదీ ట్యాగ్ నుంచి బయటపడేందుకు వారికి ఈ ఉద్యోగం ఎంతోఉపయోగపడుతోందిని  పుఝల్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి వారు ప్రజా జీవితంలో అందరిలా కలిసిపోవచ్చని, చెడుని వదిలి మంచిగా మారేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.  

2023  ఆగస్టు 10న తమిళనాడు ప్రభుత్వంఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ పేరుతో  పెట్రోల్ పంపును  ప్రారంభించింది. పుఝల్‌లోని జైలు కాంప్లెక్స్ ప్రాంగణం వెలుపల దీనిని ప్రారంభించారు.  దీనిని జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు నిర్వహిస్తున్నారు.. పుఝల్ జైలులో సత్ప్రవర్తన ఆధారంగా 26 మంది మహిళలను ఎంపిక చేశారు. జైలు శాఖ ప్రకారం పెట్రోల్ అవుట్‌లెట్‌లో పనిచేసే ఖైదీలకు ప్రతి నెలా రూ. 6 వేల జీతం లభిస్తుంది

తమిళనాడు జైళ్ల శాఖ ఇప్పటికే సంస్కరణలు, పునరావాసంలో భాగంగా ప్రిజన్ బజార్ ని నిర్వహిస్తోంది. ఇక్కడ ఖైదీలు తయారుచేసిన షూలు, రెయిన్ కోట్లు, రెడీమేడ్ దుస్తులు, హస్తకళల ద్వారా రూపొందిన కళాకృతులు, నోట్ పుస్తకాలు, కంపోస్టు ఎరువు, బేకరీ ఉత్పత్తులు, వారు పండించిన కూరగాయలు వంటివాటిని ఫ్రీడం అనే బ్రాండ్ పేరుతో అమ్ముతున్నారు.