- ఈ రాత్రికి గద్దెకు చేరనున్న వనదేవత
- స్వాగతం పలుకనున్న లక్షలాది భక్తులు
- పగిడిద్దరాజు, గోవింద రాజు కూడా గద్దెకు
మేడారం భక్త జనసంద్రమైంది. ఈ రాత్రికి కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో మహాజాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కన్నెపల్లి ఆలయంలో వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేశారు. పూజారి కాక సారయ్య, కాక కిరణ్ కన్నెపల్లిలోని ఆలయంలో పుట్టమన్నుతో అలికి ముగ్గులు పెట్టారు. అదే సమయంలో మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర కూడా పూజలు నిర్వహించారు. పూజారి సిద్దవేయిన మునీందర్ తన ఇంటి వద్ద పూజలు నిర్వహించి పసుపు, కుంకుమలు తీసుకొని సమ్మక్క గుడికి చేరుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అలికి ముగ్గులు పెట్టారు.
రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నె పల్లి నుంచి జంపన్న వాగు మీదుగా సారలమ్మ గద్దెకు చేరుకుంటుంది. వాగు రూపంలో ఉన్న తన తమ్ముడిని సారలమ్మ స్పృషిస్తుందని పూజారులు చెబుతారు. ఈ సమయంలో వడ్డెలను సారలమ్మ దేవత అవహిస్తుందని అంటారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య సారలమ్మ గద్దెకు చేరుకుంటుంది. నిన్న సాయంత్రం పూనుగొండ్లలో బయల్దేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజును పస్రా మీదుగా మేడారం తీసుకువస్తున్నారు.
సారలమ్మ భర్త గోవిందరాజు నిన్న కొండాయి నుంచి మేడారం వస్తున్నారు. ఈ రాత్రికి ఈ ముగ్గురు.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు మేడారం గద్దెలకు చేరుకుంటారు. దీంతో మహాజాతర ప్రారంభమవుతుంది.
