V6 News

ప్రచార హోరు.. ముగిసిన తొలివిడత ప్రచారం

ప్రచార హోరు.. ముగిసిన తొలివిడత ప్రచారం
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు

వెలుగు, నెట్​వర్క్​: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచారం మంగళవారం ముగిసింది. ప్రచారానికి చివరి రోజు కావడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులతో ప్రచారం హోరెత్తింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క, వరంగల్​ జిల్లా  వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఎమ్మెల్యే నాగరాజు, గీసుగొండ మండలంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్​రెడ్డి, రాయపర్తి మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, తొర్రూరు మండలంలో టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ఝాన్సీరెడ్డి కాంగ్రెస్​ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

 మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్​ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కాగా, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో బీఆర్​ఎస్​ బలపర్చిన అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రచారం చేయగా, ఏటూరునాగారంలో ఆ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్​బాబు, లింగాల ఘన్​పూర్​ మండలంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థుల ప్రచారంలో వరంగల్​ కోఆపరేటీవ్​బ్యాంక్​ చైర్మన్​ ఎర్రబెల్లి ప్రదీప్​రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.