హైదరాబాద్: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ మొదలైంది. మొత్తం 189 మండలాల్లోని 3,834 పంచాయతీల్లో పోలింగ్ మొదలైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బుధవారమే పోలింగ్ సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు.
ఫస్ట్ ఫేజ్‌లో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 396 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మొత్తం 37,440 వార్డులకు గాను 169 చోట్ల నామినేషన్లు రాలేదు. 9,633 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 27,628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 65,455 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో ఒక పంచాయతీకి ఎన్నిక జరగడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1,66,48,496 మంది ఓటర్లు ఉండగా.. తొలి విడతలో 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదార్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఎస్ఈసీ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు.

