- ఈనెల 11న తొలి విడత మండలాల్లో పోలింగ్
- ఉమ్మడి జిల్లాలో 317 గ్రామాల్లో సర్పంచ్ బరిలో 937 మంది ..
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గ్రామాల్లో ఇవాళ్టి సాయంత్రంతో మైకులు బంద్ కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో 317 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాల్లో 937 మంది బరిలో ఉన్నారు.
ఎక్కడెక్కడ.. ఏ పరిస్థితి?
ఖమ్మం జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరిగే కొణిజర్ల, వైరా మండలాలు వైరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండగా, రఘునాథపాలెం మండలం ఖమ్మం అసెంబ్లీ, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాలు మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ ఏడు మండలాల్లో మొత్తం 192 గ్రామాలున్నాయి. వీటిలో 20 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 172 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో 476 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం 1,740 వార్డులకు గాను 158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 1,582 వార్డులకు పోలింగ్ జరగనుంది. వీటిలో 3,275 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో వార్డు కోసం ఒక్కో బ్యాలెట్ బాక్స్ చొప్పున 1,582 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
20 శాతం రిజర్వ్ తో కలిపి 1,899 మంది ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 2,321 మంది విధులు నిర్వహించనున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరకుగూడ మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 159 గ్రామపంచాయతీ లకు గాను 14 సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు 461 మంది బరిలో ఉన్నారు. 1,436 వార్డులకు గాను 336 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 1,0 97 వార్డులో 2,557 మంది బరిలో ఉన్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 1,428 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 1,713 మంది పోలింగ్ ఆఫీసర్లు 2,295 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి సాయంత్రంలోగా ఫలితాలను ప్రకటిస్తారు.
స్పీడందుకున్న ప్రచారం..
ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇంటింటి ప్రచారాన్ని స్పీడప్ చేశారు. తమ గుర్తులను చూపిస్తూ, ఓట్లను అభ్యర్థించడంతో పాటు, తమను గెలిపిస్తే ఫలానా పనులు చేస్తామంటూ మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతున్నారు. ఆయా అభ్యర్థుల తరపున పార్టీల ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఇక అభ్యర్థులు గ్రామాల్లో ఓటర్లను కలవడంతో పాటు, ఇతర ఊర్లలో ఉన్న వలస ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరి రోజు పూర్తిగా ఓటర్లకు డబ్బుల పంపిణీ ఎలా చేయాలి, ఓటర్లకు ఎంత చొప్పున ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. మందు, చికెన్‌తో పాటు ఓటర్లకు తాయిలాలు ముట్టజెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఆదివారం అర కేజీ చొప్పున చికెన్ ప్యాక్ చేసి, ఓటర్లకు పంచిపెట్టారు. మరికొన్ని గ్రామాల్లో ప్రచారంలో పాల్గొంటున్న వారితో పాటు గ్రామస్తులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. ఆదివారం ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీతో విందు భోజనాలు పెట్టారు. కుటుంబ ఫంక్షన్లను తలపించేలా ఈ విందులు కొనసాగుతున్నాయి.
గట్టి బందోబస్తు..
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ, పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు ఇవాళసాయంత్రం 5 గంటల నుంచి ఈనెల 11 న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలాల్లో మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధించారు. ఎన్నికలు జరిగే మండలాల్లో వైన్ షాపులు, బార్లు, మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం సీపీ, కొత్తగూడెం ఎస్పీ ప్రకటించారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
