వచ్చే ఏడాది నుంచి ఆరెస్సెస్ ‘ఆర్మీ’ స్కూల్

వచ్చే ఏడాది నుంచి ఆరెస్సెస్ ‘ఆర్మీ’ స్కూల్
  •  వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం
  •  ఫస్ట్‌‌‌‌ బ్యాచ్‌‌‌‌లో 160 మంది స్టూడెంట్స్‌‌‌‌
  • అమరుల కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్

న్యూఢిల్లీ: బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. పార్టీ కోసం నేతలను తయారు చేసి అందిస్తుంటుంది. నరేంద్ర మోడీ, అమిత్​షా.. ఇలా ఎందరో నేతలను తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆర్మీకి జవాన్లను అందించేందుకు రెడీ అవుతోంది. ఆర్మ్​డ్ ఫోర్సెస్​లో ఆఫీసర్లు అయ్యేలా స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో ‘ఆర్మీ’ స్కూల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్కూల్​ను ఆర్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ వింగ్ అయిన విద్యా భారతి నిర్వహించనుంది. స్కూల్​కు ఆర్ఎస్ఎస్ మాజీ సర్సంగ్ చాలక్ రాజేంద్ర సింగ్ అలియాస్ రాజు భయ్యా పేరు పెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్​లోని బులంద్ శహర్ జిల్లా షికార్​పూర్​లో ‘రాజు భయ్యా సైనిక్ విద్యా మందిర్’ పేరుతో ఏర్పాటు చేయనున్నారు.

సుమారు రూ.40 కోట్ల ఖర్చుతో..

గత ఆగస్టులో సుమారు 20 వేల చదరపు మీటర్ల స్థలంలో స్కూల్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ స్థలాన్ని మాజీ సోల్జర్, రైతు రాజ్​పాల్ సింగ్ డొనేట్ చేశారు. స్టూడెంట్లకు క్లాసుల కోసం మూడంతస్థుల బిల్డింగ్, హాస్టల్​కు మూడంతస్థులు, ఓ డిస్పెన్సరీ, స్టాఫ్ ఉండేందుకు ఓ రెసిడెన్స్, ఒక భారీ స్టేడియంను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం మొత్తంగా రూ.40 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.

సీబీఎస్ఈ సిలబస్

రాజు భయ్యా పుట్టిన ఊరైన షికార్​పూర్​లో అబ్బాయిల కోసం నిర్మితమవుతున్న రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో సీబీఎస్ఈ సిలబస్ ను అమలు చేయనున్నారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ క్లాసులు నిర్వహించనున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి స్కూల్ ప్రారంభం కానుంది. తొలి బ్యాచ్​లో ఆరో తరగతిలో 160 మంది స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు విద్యా భారతి ఉచ్చా శిక్ష సంస్థాన్ రీజనల్ కన్వీనర్ అజయ్ గోయల్ తెలిపారు. ఇందులో రిజర్వేషన్ స్కీమ్​కింద అమరవీరుల కుటుంబాల పిల్లలకు 56 సీట్లు రిజర్వు చేసినట్లు చెప్పారు.

రిటైర్డ్ ఆఫీసర్ల నుంచి సూచనలు

ప్రస్తుతం విద్యా భారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా కాలేజీలు నడుస్తున్నాయి. ఆర్మీ స్కూల్​నిర్వహణకు సంబంధించి వచ్చే సెప్టెంబర్​లో ఆర్ఎస్ఎస్ నేతలు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను కలవనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ‘‘చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లు ఆర్ఎస్ఎస్ లేదా అనుబంధ సంస్థలతో టచ్​లో ఉన్నారు. వారితో జరిగే సమావేశానికి సంబంధించిన తేదీలను త్వరలోనే ఖరారు చేస్తాం” అని అజయ్ గోయల్ చెప్పారు.

– అజయ్ గోయల్,
రీజనల్ కన్వీనర్, విద్యా భారతి