టీజీ 20 విజేత హైదరాబాద్ .. ఖమ్మంపై హైదరాబాద్ ఘన విజయం

టీజీ 20 విజేత హైదరాబాద్ .. ఖమ్మంపై హైదరాబాద్ ఘన విజయం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఉప్పల్‌‌‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో  జరిగిన సరికొత్త ‘టీజీ20’  లీగ్ మొదటి సీజన్ టైటిల్‌‌‌‌ను హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్ పోరులో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించి, మెగా ట్రోఫీతో పాటు రూ. 1 కోటి ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.

ఖమ్మం  స్కోరుకు బ్రేక్ వేసిన హైదరాబాద్ బౌలర్లు

టాస్ గెలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఖమ్మం ఏసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఖమ్మం జట్టులో స్టార్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ మరోసారి అద్భుతంగా రాణించాడు. కేవలం 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. కొడిమల హిమతేజ (31 పరుగులు) తో కలిసి మికిల్ జైస్వాల్ నాలుగో వికెట్‌‌‌‌కు 94 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కట్టడి చేసిన బౌలర్లు: ఒక దశలో ఖమ్మం భారీ స్కోరు చేసేలా కనిపించినా.. హైదరాబాద్ బౌలర్ యశ్వీర్ గౌడ్ (3/17) అద్భుత బౌలింగ్‌‌‌‌తో కట్టడి చేశాడు. దేవ్‌‌‌‌ మెహతా (2/25), అజయ్ దేవ్‌‌‌‌ గౌడ్ (2/36) కూడా రాణించి ఖమ్మంను 157 పరుగులకే పరిమితం చేశారు.పట్టుదలగా ఆడి.. లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు బ్యాటర్లు ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా ఆచితూచి ఆడారు. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (48) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. షణ్ముఖ అశ్విన్ (36) వైష్ణవ రెడ్డి (41) పరుగులు చేసి హైదరాబాద్ విజయం లో కీలక రోల్ పోషించారు.ఖమ్మం బౌలర్లు వికెట్లు తీస్తూ మ్యాచ్‌‌‌‌లోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, స్టార్టింగ్ లో మూడు క్యాచ్లు జారవిడడం ఖమ్మం టీం ని దెబ్బతీసింది. ఖమ్మం బౌలర్లలో వేదరెడ్డి నాలుగు నాలుగో ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు ఎవరూ రాణించలేకపోవడంతో హైదరాబాద్ బ్యాటర్లు పట్టుదలగా నిలిచి లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే 158 టార్గెట్ ను విజయవంతంగా ఛేదించారు. విన్నర్ కు రూ. 1 కోటి  ట్రోఫీ అందజేశారు. రన్నరప్ ఖమ్మంకు రూ. 50 లక్షలు,  3వ, 4వ స్థానాలు కరీంనగర్, రంగారెడ్డి  చెరో రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల,  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హెచ్సీఏ సెక్రటరి జీవన్ రెడ్డి  పాల్గొన్నారు