హైస్పీడ్‌‌ ప్రాంతీయ రైళ్లు.. పట్టాలెక్కనున్న ర్యాపిడ్ ఎక్స్

హైస్పీడ్‌‌ ప్రాంతీయ రైళ్లు.. పట్టాలెక్కనున్న ర్యాపిడ్ ఎక్స్
  • సాహిబాబాద్‌‌ - దుహై డిపో మధ్య సర్వీసులు
  • ఢిల్లీ - ఘజియాబాద్‌‌ ఆర్ఆర్‌‌‌‌టీఎస్ కారిడార్‌‌‌‌లో భాగంగా నిర్మాణం

దేశంలోనే తొలిసారి సెమీ హైస్పీడ్‌‌ రైళ్లు.. ర్యాపిడ్ ఎక్స్ శుక్రవారం పట్టాలెక్కనున్నాయి. సాహిబాబాద్‌‌-దుహై మధ్య 17 కిలోమీటర్ల మేర తిరిగే ఈ రైళ్లను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రతి ర్యాపిడ్‌‌ ఎక్స్‌‌ రైలులో ఒక కోచ్‌‌ను మహిళల కోసం రిజర్వు చేశారు. 90 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్న పిల్లలకు ప్రయాణం ఉచితం. ఈ ‘ర్యాపిడ్ ఎక్స్‌‌’ పేరును నమో భారత్’గా మార్చారు.

న్యూఢిల్లీ/ఘజియాబాద్: దేశంలోనే తొలిసారి సెమీ హైస్పీడ్‌‌ ప్రాంతీయ రైలు ‘ర్యాపిడ్ ఎక్స్’ శుక్రవారం నుంచి పట్టాలెక్కనుంది. ఢిల్లీ - ఘజియాబాద్‌‌ రీజనల్‌‌ ర్యాపిడ్‌‌ ట్రాన్సిట్‌‌ సిస్టమ్‌‌ (ఆర్ఆర్‌‌‌‌టీఎస్) కారిడార్‌‌లో సాహిబాబాద్‌‌– - దుహై మధ్య 17 కిలోమీటర్ల మేర రైలు సర్వీసులు షురూ కానున్నాయి. యూపీలోని సాహిబాబాద్‌‌ ర్యాపిడ్ ఎక్స్ స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రైలును ప్రారంభించనున్నారు. సాహిబాబాద్‌‌, ఘజియాబాద్‌‌, గుల్దర్‌‌, దుహై, దుహై డిపో స్టేషన్ల మీదుగా సర్వీసులు కొనసాగుతాయి. రూ.30 వేల కోట్లతో చేపడుతున్న 85.2 కిలోమీటర్ల దిల్లీ - ఘజియాబాద్‌‌ - మీరట్ ఆర్‌‌ఆర్‌‌టీఎస్‌‌ కారిడార్‌‌ని 2025 జూన్‌‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

రేపటి నుంచి ప్రయాణికులకు.. 

శనివారం నుంచి ర్యాపిడ్ ఎక్స్‌‌ రైళ్ల సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి 15 నిమిషాలకో రైలు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌‌లు ఉంటాయి. ఇందులో ఒకటి ప్రీమియం కోచ్. ఈ రైలులో 1,700 మంది ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. స్టాండర్డ్‌‌ కోచ్‌‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌‌లో 62 సీట్లు ఉంటాయి. స్టాండర్డ్‌‌ కోచ్‌‌లలో కనీస టికెట్‌‌ ధర రూ.20 కాగా.. గరిష్ఠ ధర రూ.50. ప్రీమియం కోచ్‌‌లో కనీస టికెట్‌‌ ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.100. సాహిబాబాద్ నుంచి దుహై డిపో స్టేషన్‌‌కు రూ.50 చార్జీ వసులు చేయనున్నారు. ప్రీమియంలో ఈ ధర  రూ.100. గరిష్ఠంగా గంటకు 160కిలో మీటర్ల వేగంతో ఈ రైలు దూసుకెళ్లనుంది. 

అత్యాధునిక సదుపాయాలు

ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు పూర్తిగా ఎయిర్‌‌ కండిషన్డ్‌‌. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వీటిలో అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. 2×2 లేఅవుట్‌‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌‌ ర్యాక్‌‌లు, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్‌‌ ఓపెనింగ్‌‌ మెకానిజం, ల్యాప్‌‌టాప్‌‌, మొబైల్‌‌ చార్జింగ్‌‌ పాయింట్లు, డైనమిక్ రూట్‌‌ మ్యాప్‌‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ప్రతి ర్యాపిడ్‌‌ ఎక్స్‌‌ రైలులో ఒక కోచ్‌‌ను మహిళల కోసం రిజర్వు చేశారు. కాగా, ‘ర్యాపిడ్ ఎక్స్‌‌’ పేరును ‘నమో భారత్’గా మార్చుతున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. 

90 సెం కన్నా తక్కువ ఎత్తుంటే ఫ్రీ
 

  • ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌టీఎస్‌‌ కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఢిల్లీ, మీరట్ మధ్య 55 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఇందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది.
  •  కౌంటర్లలోనే కాకుండా, క్యూఆర్ కోడ్‌‌ ద్వారా, వెండింగ్ మిషిన్ల, ఎన్‌‌సీఎంసీ కార్డుల, ‘ర్యాపిడ్ ఎక్స్ కనెక్ట్’ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
  • 17 కిలోమీటర్ల మేర ప్రయారిటీ సెక్షన్ ఢిల్లీ - ఘజియాబాద్ - మీరుట్ ఆర్ఆర్‌‌‌‌టీఎస్ కారిడార్‌‌‌‌కు 2019 మార్చి 8న ప్రధాని శంకుస్థాపన చేశారు.