తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మరిపెడ, వెలుగు : ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో గురువారం నిర్వహించిన గ్రాడ్యుయేట్స్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఎకరాలకైనా రైతు బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని కేబినెట్‌‌‌‌ భేటీలో సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. పచ్చిరొట్ట విత్తనాలకు గత ప్రభుత్వం మూడేళ్లుగా డబ్బులు చెల్లించలేదని చెప్పారు. సన్నాలకు రూ. 500 బోనస్‌‌‌‌ ఇస్తామంటే కేటీఆర్‌‌‌‌ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వరి వేస్తే ఉరే అన్నోళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు. వరంగల్‌‌‌‌, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎన్నికల్లో తీన్మార్‌‌‌‌ మల్లన్నకు ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల కోసం గొంతెత్తి ప్రశ్నిస్తానని, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, మహబూబాబాద్‌‌‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ బలరాం నాయక్‌‌‌‌, ఖమ్మం ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ రఘురాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు భరత్‌‌‌‌ చందర్‌‌‌‌రెడ్డి, కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు నూకల నరేశ్‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు రఘువీర్‌‌‌‌రెడ్డి, రాధాబాయ్ పాల్గొన్నారు.