- బిహార్ తరహాలో ఓటర్ల జాబితా ‘ప్యూరిఫికేషన్’: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్
- కెనడా జనాభా కంటే తెలంగాణ ఓటర్లే ఎక్కువ
- రాజ్యాంగానికి అతిపెద్ద సైనికులు బీఎల్వోలే
- ఓటింగ్‌లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉత్సాహం పట్టణాల్లో లేదని వ్యాఖ్య
- హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర బీఎల్ఓలతో సీఈసీ భేటీ
- అందరం కలిసి ప్రక్రియను విజయవంతం చేద్దామని పిలుపు
హైదరాబాద్, వెలుగు: బిహార్‌లో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను విజయవంతంగా నిర్వహించి దేశానికి మార్గదర్శనం చేశారని, త్వరలో ఈ ప్రక్రియను తెలంగాణలోనూ ప్రారంభించబోతున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ప్రకటించారు.
ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ ‘సర్’ ప్రక్రియను.. తదుపరి దశలో తెలంగాణలో పకడ్బందీగా అమలు చేసి, రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీఎల్వోలతో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు.
‘సర్’పై బీఎల్వోలకు దిశానిర్దేశం చేశారు. ‘‘తెలంగాణలో సర్‌ను మనమందరం కలిసి విజయవంతం చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ‘ప్యూరిఫికేషన్’ విషయంలో బిహార్ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ‘‘బిహార్‌లో 7.5 కోట్ల మంది ఓటర్లతో కూడిన తుది జాబితాను విడుదల చేస్తే.. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
ఎన్నికల అనంతరం రీకౌంటింగ్ విషయంలోనూ సున్నా ఫిర్యాదులు వచ్చాయంటే.. అది అక్కడి బీఎల్వోల పనితీరుకు నిదర్శనం. అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణలోనూ మనం ‘సర్’ను విజయవంతం చేయాలి. చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లులాంటి లోపాలను ఏరివేయడానికే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది” అని స్పష్టం చేశారు.
బిహార్ ఎన్నికలను 7 దేశాల నుంచి వచ్చిన 20 మంది ప్రతినిధులు పరిశీలించి, భారత ఎన్నికల వ్యవస్థను కొనియాడారని గుర్తుచేశారు. ఓటింగ్ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు చూపుతున్న ఉత్సాహం.. పట్టణ ప్రాంతాల్లో కనిపించడం లేదని సీఈసీ అన్నారు. రాబోయే రోజుల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
మనది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల యంత్రాంగం
తెలంగాణలో ఓటర్ల సంఖ్య కెనడా దేశ జనాభా కంటే ఎక్కువగా ఉందని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు.‘‘ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియను నిర్వహించడం సాధారణ విషయం కాదు. తెలంగాణలో ఒక్కో బీఎల్వో పరిధిలో సగటున 930 మంది ఓటర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును పరిశీలించి జాబితాను రూపొందించాల్సిన బాధ్యత బీఎల్వోలపైనే ఉంది”అని తెలిపారు.
దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 1.80 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల యంత్రాంగమని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో బూత్ లెవెల్ ఆఫీసర్లే ‘దేశ రాజ్యాంగానికి అతిపెద్ద సైనికులు’ అని తెలిపారు. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, మన వ్యవస్థ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు.
ఈ క్రమంలోనే రాబోయే ఏడాదిపాటు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఐడియా’కు సీఈసీ నాయకత్వం వహించనున్నారని, ఇది మన దేశానికి దక్కిన అరుదైన గౌరవమని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలోని ఓటర్ల గణాంకాలు, జిల్లాలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీనియర్ డిప్యూటీ సీఈసీ పవన్‌కుమార్ శర్మ, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
