నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్

నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
  • ఫర్టిలైజర్ షాపుల్లో విస్రృత తనిఖీలు 
  •     విత్తన సమస్యలపై రైతుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లు 
  •     ప్రతి ఏటా నకిలీ విత్తనాలతో మునుగుతున్న అన్నదాతలు 
  •     ఫర్టిలైజర్ వ్యాపారుల మాయాజాలంతో నష్టాలు

ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు : ధనార్జేనే ధ్యేయంగా ఫర్టిలైజర్ వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వారిని నట్టేట ముంచుతున్నారు. డిమాండ్ ఉన్న రకం విత్తనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై ఈ ఏడాది ముందస్తుగానే అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. నకిలీ విత్తనాల నివారణకు ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్ రాజర్షి షా టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించారు. ఆదిలాబాద్​ జిల్లాలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉండడంతో పత్తి, సోయా పంటలు ఎక్కువగా సాగుచేస్తారు.

వానకాలం సాగుకు నెల రోజుల ముందుగానే రైతులు పత్తి, సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో కొంత మంది ఫర్టిలైజర్ వ్యాపారులతో పాటు దళారులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. గుర్తించలేని రైతులు విత్తనాలు వేసి నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది నకిలీ విత్తనాలపై జిల్లా అధికారులు విస్రృతంగా తనిఖీలు చేస్తున్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు నకిలీ విత్తనాలు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా, ఇతర సమస్యలున్నా తెలియజేసేందుకు వ్యవసాయ అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు 8074812429, 9392779149 ఏర్పాటు చేశారు. 

వ్యాపారుల దోపిడీ..

జిల్లాలో ప్రతి ఏడాది ఫర్టిలైజర్ వ్యాపారుల మాయజాలంతో రైతులు మోసపోతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి విత్తన బ్యాగుపై ఉన్న ఎమ్మార్పీ ధరను మార్చేసి ఎక్కువ రేటుకు అమ్మాడు. మరో వ్యాపారి విత్తనాలు మొలకెత్తకుంటే తన బాధ్యత కాదంటూ రైతుల నుంచి ముందే బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఇలా వ్యాపారులు ఏదో ఒక రూపంలో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు.

ఇప్పటికే విత్తనాలు పంపిణీ ప్రారంభమైంది. అయితే పంపిణీలోనూ వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతులకు డిమాండ్ ఉన్న విత్తనాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇటీవల ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి విత్తన విక్రయాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. నకిలీ విత్తనాలను విక్రయాలను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ లో జిల్లా స్థాయిలో డీఎస్పీ, ఏడీఏ, ఆర్డీవో, మండల, డివిజన్ స్థాయిలో తహసీల్దార్, ఏవో, సీఐలు ఉంటారు.

నకిలీ విత్తనాల నిరోధానికి యాక్షన్ ప్లాన్

నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాల నిరోధానికి పోలీసు శాఖ వినూత్న చర్యలకు శ్రీకారం చుడుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి అక్రమ మార్గాల్లో జిల్లాకు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే వాటి అమ్మకాలపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించింది. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నకిలీ విత్తనాల నిరోధానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను సైతం రంగంలోకి దించుతున్నారు. దీంతోపాటు గ్రామాల వారీగా నకిలీ విత్తనాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వినూత్నంగా ఇన్​ఫార్మర్ నెట్​వర్క్​ను కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తోంది.

ప్రతి గ్రామంలో ఒకరిద్దరు ఇన్​ఫార్మర్లను నియమించి వారి ద్వారా సమాచారం తెలుసుకోనున్నారు. వారికి సరైన పారితోషికం కూడా అందించేందుకు పోలీసు శాఖ నిర్ణయించింది. దీంతోపాటు పోలీస్ స్టేషన్ల వారీగా నకిలీ విత్త నలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. నకిలీ విత్తనాలను అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో బార్డర్ చెక్​పోస్టులను ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ–అప్పారావుపేట మధ్య, భైంసా ప్రాంతంలోని బెల్తారోడా వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.