కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్లుగా మార్చటాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ..10 కేంద్ర- రాష్ట్ర కార్మిక సంఘాలు (బీఎంఎస్ మినహా) ఫిబ్రవరి 12న దేశవ్యాప్త స్వాత్రిక సమ్మెను పిలుపునిచ్చాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికసంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. కార్మికుల్ని నిరాయుధులను చేసేవిధంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్లెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.
వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ఆరు సంవత్సరాల క్రితమే (2019, 2020 సం.లో ) తెచ్చింది. వాటికి వ్యతిరేకంగా ఇప్పటికే నాలుగుసార్లు దేశవ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు చేపట్టి ఇంతకాలం వాటిని అమలు చేయకుండా వ్యతిరేకించాం. కానీ నేడు మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచింది. కార్పొరేట్ల ప్రయోజనాలు, వారి లాభాలు పెంచేందుకే 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
కార్మికవర్గంపై భారాలు
2025 శీతాకాల పార్లమెంటు సమావేశాలు ముగిసే సమయంలో హడావుడిగా మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి వీబీ జీ -రామ్ జీ స్కీంను తెచ్చి రాష్ట్రాలపై ఆర్థికభారం మోపింది. విద్యుత్ సవరణ బిల్లు 2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను, బిల్లులను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేసింది. పట్టణ, -గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న శ్రామికవర్గాలను చావుదెబ్బ కొట్టింది.
కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసంఘటిత రంగంలో పనిచేసే 45 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించేవిధంగా ఈఎస్ ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇవి ఏవీ కల్పించకపోగా 4 లేబర్ కోడ్ల అమలుతో 45 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలు చితికిపోయేలా కార్పొరేట్లు లాభాలు పోగేసుకోవడానికి మార్గం సుగమం చేసింది. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంతృత్వ, దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకొని మార్చివేసింది. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ వ్యతిరేక చర్య. అంతర్జాతీయ కార్మిక సంస్థ ‘ఐఎల్ఓ’ సిఫార్సులను పూచిక పుల్లలా తీసి పారేశారు.
కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర
బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం -1926 ప్రకారం యూనియన్లు ఏర్పాటు కార్మికుల హక్కుగా పొందారు. కానీ, ఈ లేబర్ కోడ్లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటితమయ్యే హక్కు, నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కుపాదం మోపారు. ఉద్యోగ భద్రత పట్ల యాజమాన్యాలకున్న అన్ని బాధ్యతలు తొలగించారు. హైర్ అండ్ ఫైర్ పద్ధతిని తీసుకొచ్చి పర్మినెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారు.
కోర్ యాక్టివిటీలో సైతం విచ్చలవిడిగా కాంట్రాక్టు కార్మికులను నియమించుకోవడం చట్టపరం చేశారు. ఫిక్స్డ్ టర్మ్ ఉపాధిని శాశ్వతం చేసింది. ఈ విధానం వల్ల పెట్టుబడిదారులకు అనేక రెట్లు లాభాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. కార్మికుల రిట్రెంచ్ మెంటు, లేఆఫ్ లకు 100 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ యజమాన్యం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఎత్తివేసి 300కు పెంచారు.
లేబర్ అధికారుల కోరలు పీకి ఫెసిలిటేటర్‌గా మార్చి వారిని మధ్యవర్తులుగా రాయబారాలు చేసే అనామకులుగా నిర్ణయించారు. లేబర్ కోర్టులను రద్దుచేసి వాటి స్థానంలో పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలు కాకుండా ఉండేందుకు అపరిమితమైన అధికారాలు ప్రభుత్వాలకు కట్టబెట్టారు.
కనీస వేతనాల నిర్ణయం యజమాన్యం చేతిలో..
కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత నుండి యజమాన్యాలు చట్టబద్ధంగా తప్పించుకునేందుకు పలు మార్గాలను సృష్టించారు. కనీస వేతనాలకు బదులుగా ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం అమలు చేయనున్నట్లు లేబర్ కోడ్స్‌లో పేర్కొన్నారు. కనీస వేతనాల నిర్ణయానికి ఇప్పటివరకు ఉన్న డా. అక్రాయిడ్ సిఫార్సులు, 1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు, కనీస వేతనాలపై 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిలోదకాలిచ్చారు.
ఎన్ని పని గంటలు ఉండాలో, ఎప్పుడు విరామం ఉండాలో, ఎంత ఓవర్ టైం ఉండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అంటే పరిశ్రమాధిపతులు నిర్ణయించిన స్టాండింగ్ ఆర్డర్స్‌కే ప్రభుత్వం తలఊపేవిధంగా నిబంధనలు ఉన్నాయి. మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినం పోరాట స్ఫూర్తిని నేటి కార్మిక వర్గానికి తెలియకుండా చేసే ప్రయత్నాలకు పూనుకున్నారు. మన రాష్ట్రంతోపాటు ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో పని దినాన్ని 10 గంటలకు, స్ప్రెడ్ ఓవర్ టైంను 12 గంటలకు పెంచుతూ చట్ట సవరణలు చేశారు.
లేబర్ కోడ్స్ రద్దయ్యేవరకు పోరాడాలి
ఈ లేబర్ కోడ్స్ వల్ల ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలు వంటి అన్ని ప్రయోజనాలు కనుమరుగు అవుతాయి. ఈ కోడ్స్ అమలు అయితే అధికశాతం కార్మికులకు చట్టపరంగా సామాజిక భద్రత పరిధి నుంచి గెంటి వేయబడతారు. లేబర్ కోడ్ల వల్ల అసంఘటిత రంగ కార్మికులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని మోదీ ప్రచారం చేస్తోంది.
భవన ఇతర నిర్మాణ కార్మికులకు, ఇతర లేబర్ వెల్ఫేర్ బోర్డులో పేర్కొన్న పథకాలు ఎలా అమలు చేస్తారనే అనే అంశంలో లేబర్ కోడ్స్ లో నిర్దిష్టమైన ప్రస్తావన లేదు. అలాగే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, ఉపాధి హామీ నేషనల్ హెల్త్ మిషన్ లాంటి స్కీములో పని చేస్తున్న వారిని కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు. కార్పొరేట్ యజమానులు కార్మికుల శ్రమను, దేశ సంపదను దోచుకునేందుకు, బానిసత్వంలోనికి నెట్టేందుకే ఈ లేబర్ కోడ్ దోహదం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా కార్మిక వర్గం ప్రతిఘటనకు పూనుకోవాలి.
లేబర్ కోడ్స్ రద్దయ్యేవరకు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. సమ్మెతోనే పాలకవర్గానికి సమాధానం చెప్పాలని ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వాత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
- ఉజ్జిని రత్నాకర్ రావు,ఏఐటీయూసీ రాష్ట సీనియర్ నేత
