స్పీకర్ ఛాంబర్‎లో కేంద్ర మంత్రి రిజిజుపై మహిళా ఎంపీ ఆగ్రహం.. అసలు అక్కడ ఏం జరిగింది..?

స్పీకర్ ఛాంబర్‎లో కేంద్ర మంత్రి రిజిజుపై మహిళా ఎంపీ ఆగ్రహం.. అసలు అక్కడ ఏం జరిగింది..?

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‎లో గందరగోళం నెలకొంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల మధ్య స్పీకర్ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంగ్రెస్‎పై విమర్శలు గుప్పించారు.  20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ చాంబర్‌లోకి చొరబడి దౌర్జన్యం చేశారని.. అంతేకాకుండా తనను దుర్భాషలాడారని ఆయన ఆరోపించారు. 

ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్కడే ఉన్నారని.. వాళ్లు ఘర్షణను ఇంకా రెచ్చగొట్టారని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష ఎంపీల తీరుపై కఠినమైన చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ స్పీకర్ ఓం బిర్లా సంయమనం పాటించారని పేర్కొన్నారు. ఈ ఘటనను పార్లమెంటరీ మర్యాదకు తీవ్ర ఉల్లంఘనగా రిజిజు అభివర్ణించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి కాంగ్రెస్‎పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ ఎంపీలు దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని.. స్పీకర్ కార్యాలయం లోపల అసభ్యకరమైన భాషను ఉపయోగించటం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తనను ఎవరూ దుర్భాషలాడరో కిరణ్​రిజిజు సదరు ఎంపీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. వీడియోలో మాత్రం కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఆగ్రహంగా మాట్లాడటం కనిపిస్తోంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‎ను కోరేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. రిజిజు ఆరోపణలపై ఎంపీ వర్షా గైక్వాడ్, కాంగ్రెస్ పార్టీ గానీ స్పందించలేదు.