పోడు సాగు అంశం సామాజికంగా, రాజకీయంగా ఎంతో సున్నితమైనది. ఇది ఆదివాసీల సంప్రదాయ జీవనవిధానంతో ముడిపడి ఉంది. తరతరాలుగా వారు అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తూ వస్తున్నారు. అయితే, ఆధునిక కాలంలో జనాభా పెరుగుదల, జీవన అవసరాల విస్తరణతో పోడు సాగు పరిమితులను దాటి విస్తరిస్తోంది. దీనివల్ల అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది.
అసలు సమస్య ఏమిటంటే.. నిజమైన అటవీ హక్కుదారులను గుర్తించడంలో ప్రభుత్వం స్పష్టత చూపకపోవడం. అదే సమయంలో ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని ఆక్రమణదారులు అటవీ భూములను స్వాధీనం చేసుకోవడం, 61 వేలకుపైగా అగ్నిప్రమాదాలు ఆక్రమణల భూముల్లో జరగడం యాదృచ్ఛికం కాదని చెప్పాల్సిందే.
అటవీ భూమిని స్వాధీనం చేసుకునే ముందు అక్కడి చెట్లు, పొదలను కాల్చివేయడం ఒక సాధారణ వ్యూహంగా మారింది. ఒకసారి అగ్నిప్రమాదం జరిగితే ఆ భూమి అటవీ భూమి అనే గుర్తింపును కోల్పోయి, ఆ తరువాత సాగుకు లేదా ఇతర ఉపయోగాలకు అనుకూలంగా మారుతుందన్న దురుద్దేశమే ఈ చర్యల వెనుక ఉంది.
అటవీ సంపద నాశనం
అటవీ అగ్నిప్రమాదాల వల్ల కలిగే నష్టం అపారమైనది. వేలాది ఎకరాల అటవీ సంపద నాశనం అవుతోంది. అడవి జంతువులు తమ నివాసాలను కోల్పోతున్నాయి. జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. నేల సారవంతం తగ్గిపోతోంది. వర్షపాతం నమూనాలు మారుతున్నాయి. దీని ప్రభావం చివరికి వ్యవసాయం, నీటి వనరులు, ప్రజల జీవనోపాధులపై పడుతోంది. అంటే అటవీ అగ్నిప్రమాదాలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాకుండా, రాష్ట్రం మొత్తం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభంగా మారాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా అటవీ అగ్నిప్రమాదాలను తాత్కాలిక సమస్యగా చూడటం మానుకోవాలి. అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, నిజమైన ఆదివాసీ కుటుంబాలకు హక్కులు కల్పించడం, ఆక్రమణలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా అటవీ భూముల పరిరక్షణకు స్పష్టమైన విధానాలు అమలు చేయాలి.
అటవీ పరిరక్షణ సమాజ బాధ్యత
అటవీ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ఇది సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత. స్థానిక గ్రామాల భాగస్వామ్యంతో అటవీ నిర్వహణ చేపట్టాలి. కమ్యూనిటీ ఆధారిత అటవీ పరిరక్షణ, ఫైర్ వాచ్ కమిటీలు, అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలు విస్తృతంగా అమలు చేయాలి. అటవీ వనరులు నశిస్తే అభివృద్ధి సాధ్యం కాదన్న వాస్త వాన్ని ప్రజల్లో బలంగా నాటాలి.
తెలంగాణ అడవులు రాష్ట్రానికి ఊపిరితిత్తుల వంటివి. వాటిని కాల్చి బూడిద చేయడం అంటే మన భవిష్యత్తునే తగలబెట్టడం. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఒక గట్టి హెచ్చరిక. ఇప్పటికైనా పాలకులు, అధికారులు, ప్రజలు మేల్కొని చర్యలు తీసుకోకపోతే, రాబోయే తరాలకు అడవులు వారసత్వంగా మిగలకపోవచ్చు. అటవీ పరిరక్షణలో విఫలమైతే, ప్రకృతి ఇచ్చే ప్రతిఫలం అత్యంత కఠినంగా ఉంటుంది.
- తిప్పర్తి శ్రీనివాస్
