మంకీ పాక్స్ వైరస్ కేసు.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ మనిషికి

మంకీ పాక్స్ వైరస్ కేసు.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ మనిషికి

టెక్నాస్: జంతువుల నుంచి అత్యంత రేర్‌‌గా మనుషులకు సోకే మంకీ పాక్స్ వైరస్‌ కేసు.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ  అమెరికాలో నమోదైంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ కేసు వచ్చిందని అక్కడి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. ఆ పేషంట్ ఇటీవలే ఆఫ్రికాలోని నైజీరియా నుంచి తిరిగివచ్చాడని, ప్రస్తుతం డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారని సీడీసీ వెల్లడించింది. ఫ్లైట్‌లో అతడితో పాటు కలిసి ప్రయాణించిన వారితో పాటు అతడు కాంటాక్ట్‌ అయిన ఇతరులను కూడా గుర్తించేందుకు ఎయిర్‌‌లైన్స్ అధికారులు, హెల్త్ సిబ్బందితో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంది. అతడు రెండు ఫ్లైట్లు మారాడని, నైజీరియా నుంచి జులై 8న అట్లాంటా చేరుకున్నాడని, ఆ తర్వాత అక్కడి నుంచి తర్వాతి రోజు డల్లాస్ చేరుకున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ మంకీపాక్స్ వైరస్ కూడా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వచ్చే డ్రాప్‌లెట్‌ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని, అయితే దీని వ్యాప్తికి చాన్స్ చాలా తక్కువ అని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మాస్క్ వాడుతుండడం వల్ల ఆ పేషెంట్‌ నుంచి మరొకరికి అంటుకుని ఉండే అవకాశం దాదాపుగా లేదని సీడీసీ వివరించింది. మంకీపాక్స్‌ వైరస్ కూడా స్మాల్‌పాక్స్ (మశూచి) లాంటిదేనని, అయితే దాని కంటే వైరల్ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుందని సీడీసీ చెప్పింది. ఈ వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. అమెరికాలో 2003లో 47 మందికి మంకీపాక్స్ సోకింది. ఆ తర్వాత మళ్లీ  అక్కడ ఈ వైరస్ కేసులు బయటపడలేదు.  
మంకీ పాక్స్ అంటే?
మంకీపాక్స్ కూడా స్మాల్‌పాక్స్ వైరస్ ఫ్యామిలీకి చెందినదే. ఈ వైరస్ ఎక్కువగా కోతులు, ఎలుకల్లో ఉంటుంది. చాలా రేర్‌‌గా మనుషులుకు సోకే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కేసులు తరచూ వస్తుంటాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మశూచి కంటే దీని వైరల్ ఇన్ఫెక్షన్ లెవల్ సీరియస్‌గా ఉంటుందని పేర్కొంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో మొదట జలుబు, ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయి. ఆ తర్వాత లింఫ్‌ నోడ్స్ వాపు రావడం, ముఖంతో పాటు శరీరం అంతా దద్దులు (ర్యాషెస్) వస్తాయి. రెండు నుంచి నాలుగు వారాల్లోనే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది.