ట్రాన్స్జెండర్ల తొలి పబ్లికేషన్​ కంపెనీ

ట్రాన్స్జెండర్ల తొలి పబ్లికేషన్​ కంపెనీ

ట్రాన్స్జెండర్ల  సమస్యలు, హక్కుల గురించి గళం విప్పే సరికొత్త మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే తొలి  ట్రాన్స్జెండర్ల  పబ్లికేషన్​ కంపెనీ, చిత్ర నిర్మాణ సంస్థ తమిళనాడులోని మదురైలో ప్రారంభమయ్యాయి.  ఈ సంస్థల ప్రాంగణంలోనే  ట్రాన్స్​ జెండర్ల కు సంబంధించిన సాహిత్యంతో ముడిపడిన పుస్తకాలతో ప్రత్యేక లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో 200కు పైగా పుస్తకాలు, ప్రభుత్వాల ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన దాదాపు 10వేలకుపైగా కొత్త కలెక్షన్స్​అందుబాటులో ఉంచారు. ట్రాన్స్​ జెండర్లకు వారి హక్కులు, చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ లైబ్రరీ ఒక విజ్ఞాన మాధ్యమంగా పనిచేయనుంది.  ఈవివరాలను  ట్రాన్స్జెండర్​ రిసోర్స్​ సెంటర్​ డైరెక్టర్​ ప్రియా బాబు ట్విటర్​ వేదికగా మంగళవారం వెల్లడించారు.

ట్రాన్స్జెండర్ల  చిత్ర నిర్మాణ సంస్థ  పేరు ‘ట్రాన్స్​ ఫిల్మ్స్​’. దీన్ని  మైక్రో, స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్​ ప్రైజెస్​ (ఎంఎస్​ఎంఈ) విభాగంలో రిజిస్టర్​ చేసుకున్నారు.  ట్రాన్స్​ జెండర్​ నటులు, గాయకులు, కళాకారులతో లఘు సినిమాలు తీయడమే దీని లక్ష్యం.  వీటికి ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా లభిస్తాయి. తొలి లఘు సినిమా చిత్రీకరణ జులై 10న ప్రారంభం కానుంది. దీన్ని ఆగస్టు లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.  400 ఏళ్ల కిందటి ట్రాన్స్​ జెండర్ల జీవితాలతో ముడిపడిన ఘట్టం నేపథ్యంలో ఈ లఘు సినిమా ఉంటుందని చెబుతున్నారు.