భర్త మరో పెండ్లి చేసుకున్నాడని రెండో భార్య ఇంటిపై దాడి .. వృద్ధురాలి మృతి

భర్త మరో పెండ్లి చేసుకున్నాడని రెండో భార్య ఇంటిపై దాడి .. వృద్ధురాలి మృతి
  • గాయపడిన రెండో భార్య 
  • పోలీసుల అదుపులో పలువురు నిందితులు  

ఎల్బీనగర్, వెలుగు: తన భర్త రెండో పెండ్లి చేసుకున్నాడని తెలిసిన ఓ మహిళ కుటుంబసభ్యులతో కలిసి దాడి చేయడంతో రెండో భార్య తల్లి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన పాతబస్తీ బహదూర్ పురా పీఎస్​పరిధిలోని కిషన్ బాగ్ లో జరిగింది. అసద్ బాబానగర్ కు చెందిన మహ్మద్ మహబూబ్(31) కు అదే ప్రాంతానికి చెందిన అమ్రిన్ బేగం(27)కు రెండేండ్ల కింద పెండ్లయ్యింది. కాగా మహబూబ్ తన మొదటి భార్యకు తెలియకుండా మూడు నెలల క్రితం కిషన్ బాగ్ కు చెందిన సాహిదా బేగం(24)ను పెండ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. తరచూ ఆలస్యంగా ఇంటికి రావడం, కొన్నిసార్లు రాకపోవడంతో మొదటి భార్య అనుమానించింది. తన భర్త రెండో పెండ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. 

మంగళవారం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి కిషన్ బాగ్ లోని సాహిదా బేగం ఇంటికి వెళ్లింది. అక్కడ సాహిదాతో పాటు ఆమె తల్లి మెహబూబ్ బీ(65) కూడా ఉంటోంది. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉంది. అమ్రిన్​బేగం, మిగతా కుటుంబసభ్యులు కలిసి రెండో భార్య, ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అప్పటికే అనారోగ్యంతో ఉన్న మెహబూబ్ బీ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వెంటనే అమ్రిన్ బేగం, వారి కుటుంబం అక్కడి నుంచి పరారైంది. ఘటనలో అమ్రిన్ బేగం, ఆమె చెల్లెలు సమ్రిన్ బేగం(24), తల్లి అమీన్ బేగం(45)తో పాటు మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని, కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.