ఇవాళ్టి ( డిసెంబర్ 1 ) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఇవాళ్టి ( డిసెంబర్ 1 ) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..  కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • సభ సజావుగా సాగేందుకు సహకరించండి
  • ఆల్ పార్టీ మీటింగ్​లో నేతల్ని కోరిన కేంద్రం
  • సర్, ఢిల్లీ బ్లాస్ట్​పై చర్చకు అవకాశం 
  • ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు కొనసాగుతాయి. ఢిల్లీలో టెర్రర్ అటాక్, బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఉభయ సభలు సమావేశమవుతున్నాయి. అలాగే, రాజ్యసభ చైర్మన్ గా సీపీ రాధాకృష్ణన్ ఫస్ట్ టైమ్ అధ్యక్షత వహించనున్నారు. ఉభ‌‌‌‌‌‌‌‌య స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌ల్లో మొత్తం 10 బిల్లులతో సహా 4 ఆర్థిక సవరణ బిల్లులు, కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసే బిల్లు, హోమ్, అణుశక్తి, విద్య, రహదారులకు చెందిన మరో 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 

అణుశక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చట్టం చేసేందుకు బిల్లును సభ ముందుకు తీసుకురానున్నది. అలాగే, నేషనల్ హైవేలు స్పీడ్​గా పూర్తయ్యేలా పారదర్శకతో కూడిన భూసేకరణ కోసం కీలకమైన చట్ట సవరణ బిల్లుపై కేంద్రం ఆలోచన చేస్తున్నది. శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థలు, పరిశోధన రంగం, ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పే లక్ష్యంగా, సమన్వయంతో పనిచేసేందుకు భారత ఉన్నత విద్యా కమిషన్​ను ఏర్పాటుచేసే దిశగా బిల్లు తీసుకురానున్నది.

సభ సజావుగా సాగనివ్వండి: కేంద్రం

ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్, కేంద్ర మంత్రి అనూప్రియాతో పాటు మొత్తం 36 పార్టీల నుంచి 50 మంది నేతలు పాల్గొన్నారు.

రెండున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. సభకు సహకరించాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలు మాత్రం దేశంలోని తాజా పరిస్థితులు, సమస్యలను ఏకరువు పెట్టాయి. 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై సభలో చర్చకు పట్టుబట్టాయి. 

భిన్నాభిప్రాయాలు కామన్: కిరణ్ రిజిజు

రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయని మీటింగ్ అనంతరం కిరణ్ రిజిజు అన్నారు. ‘విపక్షాలు చర్చల్లో పాల్గొనాలి. ప్రతిపక్షాలు చాలా అంశాలు లేవనెత్తాయి. అందులో సర్ ఒకటి. వందేమాతరం 150 ఏండ్ల సందర్భంగా పార్లమెంట్​లో చర్చపై బీఏసీ నిర్ణయం తీసుకున్నది. అఖిలపక్ష సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించిన ప్రతిపక్షాలకు ధన్యవాదాలు’ అని కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయి స్పందిస్తూ.. 2 గంటల పాటు ప్రతిపక్షాల డిమాండ్లు కేంద్రం విన్నదని.. కానీ, స్పందించలేదని విమర్శించారు.