కాళేశ్వరం బ్యారేజీలో మాయమవుతున్నచేపలు

కాళేశ్వరం బ్యారేజీలో మాయమవుతున్నచేపలు
  •                 వలలూ కొరికేస్తున్నయ్​
  •                 ఆందోళనలో మత్స్యకారులు

కాళేశ్వరం బ్యారేజీలోని చేపలు మాయమవుతున్నాయి. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం భారీ ఎత్తున చేప, రొయ్య పిల్లలను వదిలింది. ఆ చేప పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దవయ్యాయి. దీంతో గోదావరి తీరంలో ఉన్న అనేక గ్రామాల పజలు ఇక తమ ఉపాధికి డోకా లేదని భరోసాతో ఉన్నారు. కానీ వారికి నీటి పిల్లుల(జెయింట్​ వొట్టర్​) రూపంలో పెద్ద ఆపద ఎదురైంది. ఉభయచర జీవులైన ఇవి ​నీటి లోపల ఊపిరి బిగబట్టి  5 నుంచి 8 నిమిషాలు ఉండగలుగుతాయి. 10 కిలోల చేపలను కూడా ఇట్టే పట్టి తినేస్తాయి. పూర్తి మాంసాహారి అయిన ఈ ఉభయచర జీవి చేపల తలను కొరికి మిగతా భాగాన్నంతా తినేస్తాయి. 2016లో శ్రీశైలం డ్యాంలో కనబడిన ఈ నీటి పిల్లులతో అప్పట్లో మత్స్యకారులు చాలా నష్టపోయారు. చేపల కోసం వేసిన పెద్ద పెద్ద వలలు సైతం కొరికి పడేసే ఈ నీటి పిల్లులు ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్లో కనబడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

23 లక్షల చేపలు..

కాళేశ్వరం ప్రాజెక్టులో చేపలు పెంచితే స్థానిక మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది ఉండదని భావించిన తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 2019లో మేడిగడ్డ బ్యారేజీలో 20 లక్షలు, అన్నారం బ్యారేజీలో 3 లక్షలు చేపలు వదిలింది. ఏప్రిల్ 2020 నుంచి ఈ చేపలు  పట్టుకోవడానికి అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి కాళేశ్వరం వరకు 600  కుటుంబాలు కేవలం చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఈ లెక్కన సుందిళ్ల , అన్నారం బ్యారేజీ గోదావరి తీర ప్రాంతంలో సుమారు 3 వేల కుటుంబాలు ఉంటాయని అంచనా. బ్యారేజీలో ఇప్పటికే చేపలు అరకిలో నుంచి కిలో వరకు పెరిగి ఉంటాయని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. చేపలు చేతికొచ్చే సమయంలో నీటి పిల్లులు ఎంటరయ్యాయి. బ్యాక్ వాటర్ అంతటా కలియ తిరుగుతూ చేపలను వేటాడి తింటున్నాయని , వలలు కూడా కొరికేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. వీటిని ఎలా అరికట్టాలో తెలియక ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ నీటి పిల్లులను అరికట్టే పరిస్థితి లేదని మత్స్యశాఖ అధికారులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.