జూబ్లీహిల్స్, వెలుగు: మరుగున పడుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళాఖండాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో జాతీయ భౌగోళిక సూచిక (జీఐ) కీలక పాత్ర పోషిస్తున్నదని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో కేఎల్ యూనివర్సిటీ, ఎంఎస్ఎంఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ జీఐ మహోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్, కాంచీపురం చీరలు, మైసూర్ చందనం వంటి ఉత్పత్తులు దేశ ప్రతిష్టను పెంచాయని, ఇవి ఆయా ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నాలని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మారుమూల ప్రాంతాల ఉత్పత్తులను కూడా ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయాలని సూచించారు. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. జీఐ గుర్తింపు అనేది ఒక పేటెంట్ వంటిదని, వీటి మార్కెటింగ్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. పరశు రామయ్య, రాజమహేందర్ రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.
