ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీకి కసరత్తు

 ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీకి కసరత్తు
  • ఉమ్మడి జిల్లాలో రూ.6 కోట్లతో 5.39 కోట్ల పిల్లల పంపిణీకి నిర్ణయం
  • తుది దశకు చేరిన టెండర్ల ప్రక్రియ
  • వచ్చే వారం నుంచి పిల్లలను వదులుతామంటున్న ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి అధికారుల కసరత్తు చివరి దశకు చేరింది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించగా మూడు సార్లు గడువు పొడిగించిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఏడు టెండర్లు దాఖలయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ప్రస్తుతం టెండర్లు పరిశీలన దశలో ఉన్నాయని ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. టెండర్లలో పాల్గొన్న వారి ఫామ్స్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన టెండర్లను ఫైనలైజ్ చేయనున్నారు. వచ్చే వారం నుంచి చెరువుల్లో పిల్లల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఖమ్మంలో 3.49 కోట్లు... భద్రాద్రి కొత్తగూడెంలో రూ.1.90 కోట్ల చేప పిల్లలు..

ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు కలిపి 882 వనరుల్లో 3.49 కోట్ల పిల్లలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారులకు లబ్ధిచేకూరేలా ఈ పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొత్తం 763చెరువులున్నాయి. ఇందులో దాదాపు 600 చెరువుల వరకు చేప పిల్లలను వదిలేందుకు ఫిషరీస్ డిపార్ట్​మెంట్ ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి రూ.1.90 కోట్ల మేర చేప పిల్లల అవసరం ఉందని ప్రభుత్వానికి ఆఫీసర్లు నివేదికలు ఇచ్చారు. 

వీటి కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో చేప పిల్లల లెక్క, తూకం విషయంలో జరిగిన మోసాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈసారి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 210 మత్స్యకార సంఘాలుండగా, ఇందులో 16,500 మంది వరకు సొసైటీ సభ్యులున్నారు.

 వచ్చే వారం నుంచి చేప పిల్లలు పంపిణీ

వచ్చే వారంలో చేప పిల్లల పంపిణీ మొదలుపెడతాం. 80 నుంచి 100 మి.మీ. సైజు పెద్ద చేప పిల్లలు 2.11 కోట్ల వరకు, 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజు ఉండే చిన్న పిల్లలు 1.38 కోట్ల వరకు కలిపి 3.49 కోట్ల చేప పిల్లలను ఖమ్మం జిల్లా జలాశయాల్లో విడుదల చేస్తాం. సీడ్ ఫామ్స్ ను తనిఖీ చేసిన తర్వాత అడిషనల్ కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే కమిటీ టెండర్లను పరిశీలిస్తుంది. 

తక్కువ బిడ్ దాఖలు చేసిన వారిని ఎంపిక చేస్తారు. సప్లయర్లు నీటి డ్రమ్ముల్లో పిల్లలను తీసుకుని వచ్చి, చెరువుల దగ్గరే మత్స్యకార కమిటీ సమక్షంలో కౌంట్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి నీటిలో వదులుతారు. దీనివల్ల లెక్కతప్పకుండా ఉంటుంది. ‌‌‌‌‌ శివ ప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం