- సీజన్ పూర్తయినా మొదలు కాని చేప పిల్లల పంపిణీ
- 4.29 కోట్ల చేప పిల్లలకు గాను జిల్లాకు చేరుకున్నవి 80 లక్షలు మాత్రమే..
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో చేపల పెంపకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. చేప పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పటికే సీజన్ పూర్తయినా పంపిణీ ప్రక్రియ మొదలు కాకపోవడంతో చేపల పెంపకంపై మత్స్యకారులు ఆశలు కోల్పోయారు. జిల్లాకు ఈ సీజన్ లో 4 కోట్ల 29 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే చేప పిల్లల పంపిణీకి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. గతంలో చేప పిల్లలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లతో మత్స్యశాఖ అధికారులు పలుసార్లు చర్చలు జరిపినా సఫలం కాలేదు.
పెండింగ్బిల్లులను గత సర్కారు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఈసారి మొండికేశారు. ఇతర జిల్లాలకు పంపిణీ చేసినప్పటికీ నిర్మల్ లో పంపిణీకి ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఇప్పటికే చేప పిల్లల పెంపకం ప్రారంభం కావాల్సి ఉండగా అది జరగలేదు. సీజన్ ముగిసిపోవడంతో ఇక చేప పిల్లల పెంపకం సాధ్యం కాదని, ఈసారి తమ జీవనోపాధి ప్రశ్నార్థకం కాబోతోందని జిల్లాలోని దాదాపు 20 వేల మత్స్యకార కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాకు వచ్చినవి 80 వేలు మాత్రమే..
జిల్లాలోని ఐదు ప్రాజెక్టులతో పాటు పెద్ద, చిన్న చెరువుల్లో ఈసారి 4.29 కోట్ల చేప పిల్లలను పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించారు. చేప పిల్లల పంపిణీకి బిడ్ లు కూడా ఆహ్వానించారు. కాగా గత బిల్లుల బకాయిల కారణంగా కాంట్రాక్టర్లు బిడ్ లు దాఖలు చేయలేదు. రెండు మూడు నెలలు సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చించి బిడ్ లు దాఖలు చేయాలని ఒత్తిడి కూడా తెచ్చారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు చేప పిల్లల పంపిణీకి మొండికేశారు. దీంతో సీజన్ ముగిసే దశకు వచ్చింది.
చివరకు అధికారుల ప్రయత్నాల మేరకు జగిత్యాల జిల్లాకు చేప పిల్లలను పంపిణీ చేసిన ఓ కంపెనీ నిర్మల్ జిల్లాలో కేవలం 80 వేల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. చేప పిల్లలను చిన్న చెరువుల్లో కాకుండా జిల్లాలోని పెద్ద చెరువుల్లో మాత్రమే విడుదల చేశారు. కేవలం 80 వేల చేప పిల్లల పెంపకంతోనే ఈసారి సీజన్ ను సరిపెట్టుకోవాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు.
5 ప్రాజెక్టుల్లో పెంపకం లేనట్లే...
నిర్మల్ జిల్లా భూభాగంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ తో పాటు కడెం, స్వర్ణ, గడ్డన్న వాగు, పల్సికర్ రంగారావు ప్రాజెక్టుల్లో చేపలను పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఉచితంగానే వివిధ రకాల చేప పిల్లలను పంపిణీ చేసేది. ఈసారి పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఐదు ప్రాజెక్టుల రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం మొదలు కాలేదు.
ఫలితంగా గతంలో వదిలిన చేపలపైనే మత్స్యకారులు ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు, మూడు నెలల్లో పాత చేపల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉండడంతో వారి ఉపాధి ఇక ప్రశ్నా ర్థంగా మారనుంది. జిల్లాలో చేపల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
